కేసీఆర్‌కు బిగ్ షాక్.. రైతుబంధు పంపిణీకి ఈసీ బ్రేక్
ఎన్నికల వేళ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌కు పెరుగుతున్న గ్రాఫ్‌తో ఆందోళన చెందుతున్న గులాబీ శ్రేణులకు ఈసీ సంచలన షాకిచ్చింది.
రైతుబంధు పంపిణీ విషయంలో ఎలక్షన్ కమిషన్ యూటర్న్ తీసుకుంది. రైతుబంధు పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి హరీష్ రావు ‘పలానా సమయానికి, పలానా తేదీన రైతుబంధు డబ్బులు పడుతాయి’ వ్యాఖ్యానించి నిబంధనలు ఉల్లంఘించారని ఈసీ పేర్కొంది.
హరీష్ రావు బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున మోడల్ కోడ్ కండక్ట్ ఉల్లంఘించారని, అందుకే అనుమతిని ఉపసంహరించుకుంటున్నామని అని ఈసీ పేర్కొంది. ఈ మేరకు మంత్రి హరీష్ రావుకు నోటీసులూ జారీ చేసింది.
కాగా, ప్రతి ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. రెండు విడుతల్లో ఆర్థిక సాయాన్ని అందిస్తుండగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రబీ సీజన్‌కు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో సాయాన్ని జమ చేయలేకపోయింది.
అయితే, ప్రభుత్వం రైతుబంధు నిధుల విడుదలకు ఈసీ అనుమతి కోరగా.. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది.
తాజాగా.. ఈసీ అనుమతిపై విపక్షాలు తీవ్రంగా రియాక్ట్ కావడంతో పాటు ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు లబ్ధి చేకూరేలా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని ఆరోపణలు చేశాయి. దీంతో రైతుబంధు పంపిణీపై ఈసీ యూటర్న్ తీసుకున్నట్లు సోమవారం ప్రకటించింది.