కరీంనగర్ కమలంలో కొట్లాట..
బండి సంజయ్‌కి పార్లమెంటు టికెట్‌పై రాజుకున్న అగ్గి
అధిష్ఠానం నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి
తెలంగాణ బీజేపీలో ముసలం మొదలైంది. సీనియర్ నాయకులకు, నిన్నమొన్నటి వరకు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్‌కు మధ్య ఏమాత్రం పొసగడం లేదు.
ఒకరిపై ఒకరు పట్టుసాధించే ప్రయత్నంలో పోరు తీవ్రతరమైంది. బండికి కరీంనగర్ టికెట్ ఇస్తే ఊరుకునేది లేదంటూ సీనియర్లు తీర్మానం చేసిన 48 గంటలు కూడా కాకముందే.. శనివారం పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తమయ్యేందుకు బండి సమావేశం నిర్వహిస్తుండడం పార్టీలో అగ్గి మరింత రాజేసింది.
పార్టీ మధ్యప్రదేశ్ ఇంచార్జి మురళీధర్‌రావు కరీంనగర్ లోక్‌సభ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తలతో కరీంనగర్ రాజకీయం రసవత్తరంగా మారింది.
గతంలో రహస్యం.. ఇప్పుడు బహిరంగం
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన బండి సంజయ్‌కు వ్యతిరేకంగా గతంలోనూ ఒకటి రెండుసార్లు సీనియర్లు సమావేశమైనప్పటికీ, ఈసారి మాత్రం బహిరంగంగానే తిరుగుబాటు చేస్తున్నారు.
ఆయనకు వ్యతిరేకంగా కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన సమావేశంలో పార్టీ సీనియర్లు పలువురు పాల్గొన్నారు. బండి ఒంటెత్తు పోకడలు వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతున్నదని తీవ్ర విమర్శలు చేశారు.
సీనియర్లకు కనీస గౌరవం ఇవ్వడం లేదని, వ్యతిరేకిస్తే కక్ష పెంచుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల పేరిట అక్రమాలకు కూడా పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆయనకు పలుమార్లు అవకాశం ఇచ్చారని,
ఈసారి కొత్తవారికి ఇవ్వాలని సమావేశంలో అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాను అడ్డంపెట్టుకుని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితోపాటు ఈటల రాజేందర్, లక్ష్మణ్ వంటి నాయకులపై అసత్య ప్రచారం చేస్తున్నారని కూడా ఆరోపించారు.
తగ్గేదే లేదంటున్న బండి
తనకు వ్యతిరేకంగా సీనియర్లు సమావేశమైన విషయం తెలుసుకున్న బండి సంజయ్ పార్టీపై పట్టుకోసం మరిన్ని ప్రయత్నాలు ప్రారంభించారు.
సీనియర్లకు చెంపపెట్టులా శనివారం కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులతో సమావేశం అవుతున్నట్టు తెలుస్తున్నది.
ఈ నెలాఖరులోగా 20 వేలమంది పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సీనియర్లు సహకరించినా, లేకున్నా తన వైఖరిలో మార్పు ఉండదని చెప్పడంతోపాటు తానే మళ్లీ బరిలోకి దిగుతున్నట్టు సంకేతాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో అధిష్ఠానం ఎటువైపు ఉంటుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొన్నది..