స్కీమ్‌లకు కేసీఆర్ పేరు తొలగింపు!
హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ పేరిట ఉన్న స్కీమ్‌ల పేర్లను మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషనల్ కిట్ పేరిట రెండు స్కీమ్‌లు ఉన్నాయి.
ప్రభుత్వ దవాఖాన్లలో డెలివరీ చేయించుకున్న మహిళలకు కేసీఆర్ కిట్ ఇస్తున్నారు. ఇదే స్కీమ్ కింద ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగ పిల్లాడైతే రూ.12 వేలను దశలవారీగా తల్లి అకౌంట్‌లో వేస్తారు. రెండేండ్లుగా కిట్‌లు మాత్రమే ఇస్తున్నారు. డబ్బులు ఇవ్వడం ఆపేశారు.
కేసీఆర్ న్యూట్రిషనల్ కిట్ స్కీమ్‌ను ఈ ఏడాదే ప్రారంభించారు. ఈ స్కీమ్ కింద గర్భిణులకు పోషకాహార పదార్థాలను అందజేస్తున్నారు. ఈ రెండు స్కీమ్‌లను ఇలాగే కొనసాగించే యోచనలో ఉన్న కాంగ్రెస్ సర్కార్, వాటి పేర్లను మాత్రం మార్చే ఆలోచన చేస్తున్నది.
ఇప్పటికే ఈ అంశంపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అధికారులతో చర్చించినట్టు సమాచారం. కొత్తగా ఏం పేర్లు పెట్టాలనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదని వారు తెలిపారు.