
మానసిక వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్యాయత్నం
పరకాల : అత్తవారింటి కుటుంబ సభ్యుల మానసిక వేధింపులను తట్టుకోలేక ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శాయంపేట మండలంలోని నేరేడుపల్లిలో చోటుచేసుకుంది. బాధితురాలు కోమల అని గుర్తించారు.
ఆమె మేనమామ గొడుగుల సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. రాయపర్తికి చెందిన మచ్చ సైదుతో నాలుగేళ్ల క్రితం కోమల వివాహం జరిగింది. అనారోగ్యంతో భర్త మృతి చెందాక, కోమల తల్లి ఇంటిలోనే నేరేడుపల్లిలో నివాసముంటోంది.
వివాహ సమయంలో ఇచ్చిన వరకట్నానికి సంబంధించిన మిగిలిన రూ.10 లక్షలు ఇవ్వాలని పెద్దల సమక్షంలో జరిగిన పంచాయితీలో నిర్ణయించారని సుదర్శన్ తెలిపారు.
కానీ ఆ డబ్బులు అడిగిన కోపంతో అత్తవారి కుటుంబ సభ్యులు శ్రీలత, మున్నా, శ్రీనివాస్, అనిల్ ఆమెను తీవ్రంగా దూషించి, “నీ భర్త చనిపోయాడు, నీవు కూడా చనిపో” అంటూ మానసికంగా హింసించారని ఆరోపించారు. ఈ వేధింపులు తట్టుకోలేక కోమల జూన్ 30న పురుగుల మందు తాగినట్లు తెలిపారు.
సమయానికి 108 అంబులెన్స్‌లో పరకాల సివిల్ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి న్యాయం చేయాలని సుదర్శన్ డిమాండ్ చేశారు.
బాధితురాలిని పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు ఆసుపత్రిలో పరామర్శించారు. పోలీసులు స్పందించి న్యాయం జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.