
బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ పార్టీ అసలు గుట్టు బయటపడింది – పగడాల నాగరాజు
బీసీ రిజర్వేషన్లపై ఇవాళ హైకోర్టు వెలువరించిన తీర్పుపై స్పందించిన ఖమ్మం నగర BRS పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు గారు మాట్లాడుతూ —
“బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మళ్లీ బహిర్గతమైంది. బీసీ రిజర్వేషన్ బిల్లుపై సరైన చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేయకుండా, రెండేళ్లుగా బీసీలను మోసం చేస్తూ నాటకాలు ఆడింది.
తమ అనుకూల వ్యక్తుల ద్వారా కోర్టులో కేసులు వేయించి, నిన్న కావాలనే హైకోర్టులో విచారణను ఇవాళ్టికి వాయిదా వేయించి… ఇవాళ కోర్టు నుండి స్టే తెచ్చుకుంది అనేది స్పష్టమైంది. ఇది కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గాల పట్ల ఎలాంటి నిజమైన నిబద్ధత లేకుండా కేవలం రాజకీయ లాభాల కోసమే వ్యవహరిస్తోందన్నది మరోసారి రుజువైంది.”
అలాగే, ఆయన మరింతగా పేర్కొంటూ —
“కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట బీసీ సామాజిక వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీసీలకు నిజమైన న్యాయం చేయడంలో విఫలమైంది. ఈరోజు హైకోర్టు తీర్పుతో వారి అసలు ఉద్దేశం బట్టబయలైంది” అన్నారు.
బీసీల హక్కులు, రిజర్వేషన్ల పరిరక్షణ కోసం BRS పార్టీ ఎల్లప్పుడూ అగ్రగామిగా నిలుస్తుందని, ఈ అంశంలో బీసీ వర్గాల న్యాయమైన హక్కులను కాపాడేందుకు పార్టీ నిరంతర పోరాటం చేస్తుందని పగడాల నాగరాజు స్పష్టం చేశారు.




