
కర్రీ పఫ్ లో పాము పిల్ల.. షాక్ అయిన మహిళ
వామ్మో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల్లో ఏమైనా తినాలంటేనే భయమేస్తోంది. సరదాగా ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్ తో కానీ బయటకెళ్లి ఏమైనా తిందామా ?అని వెళ్తే అక్కడికెళ్లాక..కుళ్లిపోయిన బిర్యానీలు, ఐస్ క్రీంలో చేతి వేళ్లు, పురుగులు ఇలాంటి ఘటనలు చూస్తేనే తిన్నది కాస్త బయటకొస్తుంది.
దీంతో బయట ఫుడ్ తినాలంటేనే జడుచుకోవలసిన పరిస్థితి. బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్, ఇండ్లీ, దోశ ఇలా తిండి ఏదైనా ఆయా రెస్టారెంట్ల నిర్లక్ష్యం మూలంగా తినే తిండిలో బల్లులు, ఎలుకలు, ఒక్కోసారి పాములు కూడా దర్శన మిస్తున్నాయి. పలు హోటళ్లు, రెస్టారెంట్లు కనీస శుభ్రత పాటించకుండా కస్టమర్ల ఆరోగ్యాలతో.. ప్రాణాలతో చలాగాటం ఆడుకుంటున్నాయి.
నాలుగు రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్, చౌబేపూర్లో పరోటాలో బల్లి బయటపడిన విషయం తెలిసిందే. మరోచోట పనీర్ కర్రీలో మాంసం ముక్కలు దర్శనమిచ్చాయి. ఈ ఘటనలు మరువక ముందే మరో సంఘటన వెలుగు చూసింది. అదెక్కడో కాదు మన తెలంగాణలోనే.
ఒక మహిళ తింటున్న కర్రీ పఫ్లో ఏకంగా పాము బయటపడిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన తెలంగాణలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్లలోని జౌఖీనగర్కు చెందిన శ్రీశైల అనే మహిళ మంగళవారం సాయంత్రం తన పిల్లలను స్కూలు నుంచి ఇంటికి తీసుకు రావడానికి వెళ్లింది.
ఈ క్రమంలో మార్గం మధ్యలో ఓ బేకరీ చూసిన పిల్లలు పఫ్లు కావాలని కోరడంతో జడ్చర్ల పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న శ్రీలక్ష్మి అయ్యంగారి బేకరీలో రెండు ఎగ్ పఫ్ లు, రెండు కర్రీ పఫ్ లు కొనుగోలు చేసింది.
ఎగ్పఫ్లను పిల్లలిద్దరూ బేకరీ దగ్గరే తినేశారు. కర్రీ పఫ్ను శ్రీశైల ఇంటికి పార్శిల్ తీసుకువచ్చింది. ఇంటికి తీసుకొచ్చిన కర్రీ పఫ్ ను తిందామని స్టార్ట్ చేసింది. అంతే పఫ్లో కనిపించిన దృశ్యం చూసి శ్రీశైల పై ప్రాణాలు పైనే పోయాయి.
ఆమె కర్రీ పఫ్ తిందామని కొరకగా అందులో చచ్చిన పాము పిల్ల కనిపించింది. దాన్ని చూసి ఆమె షాక్ తో వణికిపోయింది. కొంచెం ధైర్యం చేసి దాన్ని అలాగే తీసుకెళ్లి బేకరీ వారిని నిలదీసింది.
అయితే బేకరీ నిర్వహకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పాటు ఇలాంటి చిన్న చిన్న ఘటనలు జరగడం సహజమేనని, ఇలా చాలాసార్లు వస్తుంటాయని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు…అంతేకాక ఆ మహిళ వద్ద నుండి పాము పిల్ల ఉన్న కర్రీ పఫ్ ను లాక్కునే ప్రయత్నం చేశారు.
దీంతో ఆ మహిళ అదే కర్రీ పఫ్ తీసుకొని జడ్చర్ల పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అనుకున్న పోలీసులు వెంటనే బేకరీ వద్దకు చేరుకొని, ఆహార పదార్థాలను పరిశీలించారు.
కేసు నమోదు చేసుకుని, ఫుడ్ ఇన్స్పెక్టర్ కు సమాచారం అందించారు. కాగా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇచ్చే నివేదిక ఆధారంగా బేకరీ నిర్వహకులపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధమయ్యారు.
ఇక, కర్రీ పఫ్లో పాము వెలుగు చూసిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. దానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.