సస్పెన్షన్లు షురూ… సీఐ, ఎస్సై తో పాటు ఓ ఐపీఎస్ కూడా..
- ఒక్క రోజు వ్యవధిలో ఓ సీఐ, మరో ఎస్సైపై వేటు
- నిందితుడిగా ఓ ఐపీఎస్ అధికారిని తాజాగా విచారించిన పోలీసులు
- ఎంతటివారైనా ఉపేక్షించవద్దని గతంలోనే ఆదేశాలు జారి
హైదరాబాద్: వరుసగా జరుగుతున్న ఘటనలు పోలీసుశాఖలో కలకలం రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆస్తి వివాదానికి సంబంధించి నమోదయిన కేసులో బుధవారం ఓ ఐపీఎస్ అధికారిని నిందితుడిగా చేర్చి విచారించడం చర్చనీయాంశంగా మారింది. అలాగే ఒకే ఒక్క రోజు వ్యవధిలో ఓ సీఐని, మరో ఎస్సైని సస్పెండ్ చేశారు కూడా. పోలీసుశాఖ విషయంలో అనుసరించబోయే విధానం ఎలా ఉంటుందో బదిలీల ద్వారా చెప్పకనే చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఐపీఎస్ అధికారిని నిందితుడిగా చేర్చడం ద్వారా క్రమశిక్షణ ఉల్లంఘించే వారు ఎంతటి వారయినా సహించేది లేదని పరోక్షంగా హెచ్చరించినట్లయింది. క్రమశిక్షణ మీరేవారిని ఏమాత్రం ఉపేక్షించవద్దని ఇదివరకే ఉన్నతాధికారులు అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.
విచారణ పేరుతో రోజుల తరబడి వాయిదా వేయకుండా…
ప్రజలతో దగ్గరగా ఉండే పోలీసుశాఖకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. పోలీసుల పనితీరు పారదర్శకంగా ఉండాలంటే పోస్టింగుల్లో పైరవీలకు ముందుగా స్వస్తి పలకాలని భావిస్తోంది.
అందుకే క్రమశిక్షణగల అధికారులుగా పేరున్న వారికి మంచి పోస్టింగులు ఇస్తోంది. ఇది పోస్టింగులకు మాత్రమే పరిమితం కాదని, ప్రవర్తన విషయంలోనూ అంతే పారదర్శకంగా ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. దీనిలో భాగమే తాజా పరిణామాలని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.
పోలీసులపై వచ్చే ఆరోపణలకు సంబంధించి విచారణ పేరుతో రోజుల తరబడి వాయిదా వేయకుండా, తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా ఎస్పీలు, కమిషనర్లకు ఇచ్చిన మౌఖిక ఆదేశాలలో పేర్కొన్నారు. దీని ప్రభావం అప్పుడే కనిపిస్తోంది.
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నివాసం ఉండే ప్రజాభవన్ వద్ద బ్యారికేడ్లను ఢీకొట్టిన కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడి పేరును తప్పించిన ఆరోపణలపై పంజాగుట్ట సీఐ దుర్గారావును తక్షణమే మంగళవారం సస్పెండ్ చేశారు. స్టేషన్‌కు వచ్చిన ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఫిర్యాదుపై మియాపూర్ ఎస్సై గిరీష్‌కుమార్‌ను సైబరాబాద్ కమిషనర్ సస్పెండ్ చేశారు.
ఈ రెండూ ఒకే రోజు జరిగాయి. సివిల్ వివాదంలో తలదూర్చి, ఓవ్యక్తిని చిత్ర హింసలకు గురిచేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేపీహెచ్‌బీ పోలీసులపై విచారణ జరుగుతోంది. ఇందులోనూ కఠిన చర్యలు ఉండవచ్చని తెలుస్తోంది.
దీంతోపాటు ఐఏఎస్ మాజీ అధికారి భన్వర్‌లాల్ ఇంటికి సంబంధించి ఫోర్జరీ ధ్రువపత్రాలు సృష్టించారన్న ఆరోపణలపై మరో ఇద్దరితోపాటు ఐపీఎస్ అధికారి, తెలంగాణ పోలీసు అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న నవీన్‌కుమార్‌ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నిందితునిగా చేర్చారు.