26,146 ఉద్యోగాలు.. వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి! దేశంలోని కేంద్ర సాయుధ బలగాల్లో 26,146 కానిస్టేబుల్‌ (జీడీ) ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ https://ssc.nic.in/ లో దరఖాస్తు చేసుకొనేందుకు ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ కీలక విజ్ఞప్తి చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీని పొడిగించబోమని, త్వరగా దరఖాస్తులు చేసుకోవాలని కోరుతోంది. చివరి రోజు వరకు …

26,146 ఉద్యోగాలు.. వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి!

దేశంలోని కేంద్ర సాయుధ బలగాల్లో 26,146 కానిస్టేబుల్‌ (జీడీ) ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ https://ssc.nic.in/ లో దరఖాస్తు చేసుకొనేందుకు ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉంది.

ఈ నేపథ్యంలో అభ్యర్థులకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ కీలక విజ్ఞప్తి చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీని పొడిగించబోమని, త్వరగా దరఖాస్తులు చేసుకోవాలని కోరుతోంది.

చివరి రోజు వరకు వేచి చూడటం ద్వారా సర్వర్‌ సమస్యలతో పాటు ఇతర సాంకేతిక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. అందువల్ల ఆసక్తి కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోండి.

మరోవైపు, పదో తరగతి విద్యార్హతతో కేంద్ర సాయుధ బలగాల్లోని వివిధ విభాగాల్లో 26వేలకు పైగా కానిస్టేబుల్‌ (జీడీ) పోస్టుల భర్తీకి నవంబర్‌లో SSC నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తులకు తుది గడువు డిసెంబర్‌ 31 వరకు, ఫీజు చెల్లింపునకు జనవరి 1 వరకు అవకాశం కల్పించింది.

ఆన్‌లైన్‌ పరీక్ష ఫిబ్రవరి లేదా మార్చిలో జరిగే అవకాశం ఉంది. ఇంగ్లిష్‌, హిందీ భాషల్లోనే కాకుండా తెలుగు సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు.

నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే..

ఏ విభాగంలో ఎన్నెన్ని పోస్టులు: మొత్తం 26,146 ఉద్యోగాలు కాగా.. వీటిలో 23,347 పురుషులు, 2,799 మహిళా కేటగిరీలో భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా చూస్తే.. బీఎస్‌ఎఫ్‌లో 6,174; సీఐఎస్‌ఎఫ్‌లో 11,025; సీఆర్‌పీఎఫ్‌లో 3337; ఎస్‌ఎస్‌బీలో 635; ఐటీబీపీలో 3189; ఏఆర్‌లో 1490; ఎస్‌ఎస్‌ఎఫ్‌లో 296 చొప్పున మొత్తంగా 26,146 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

ఈ పోస్టులకు ఎంపికైతే పే-లెవెల్‌ 3 కింద రూ.21,700 నుంచి 69,100 వరకు వేతనం అందజేస్తారు.

అభ్యర్థుల వయసు: జనవరి 1, 2024 నాటికి 18 నుంచి 23 ఏళ్లు మించరాదు. ఆయా వర్గాల వారీగా వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.

దరఖాస్తు రుసుం: రూ.100 (మహిళలు, ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వర్గాలకు చెందినవారికి మినహాయింపు)

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష, పీఈటీ/పీఎస్‌టీ/ వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఆబ్జెక్టివ్‌ రూపంలో ఉంటుంది. 60 నిమిషాల పాటు ఉండే ఈ పరీక్షలో మొత్తం 80 ప్రశ్నలకు 160 మార్కులకు ఉంటుంది.

పరీక్షలో జనరల్‌ ఇంటెలిజెన్స్‌, రీజనింగ్‌; జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌; ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌; ఇంగ్లిష్‌/హిందీ సబ్జెక్టుల్లో ఒక్కో అంశంలో 20 ప్రశ్నలు చొప్పున మొత్తం 80 ప్రశ్నలు ఇస్తారు.

ఒక్కో తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. సమాధానం రాసేముందు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే.. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌.

Updated On 28 Dec 2023 5:39 PM IST
cknews1122

cknews1122

Next Story