భూ సమస్యల పరిష్కారానికి సర్వే!
గ్రామీణ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహణకు కార్యాచరణ
నివేదిక రూపకల్పనకు మంత్రి పొంగులేటి ఆదేశాలు
ప్రజాపాలన అనంతరం నిశిత దృష్టి
రాష్ట్రంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై రెవెన్యూశాఖ నివేదిక రూపొందిస్తోంది. సమగ్ర భూ సర్వే చేపట్టేందుకు ఉన్న అవకాశాలపైనా దృష్టి సారించింది. రాష్ట్రంలో తొలుత గ్రామీణ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద సర్వే నిర్వహించాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం సర్వేకు సంబంధించిన ప్రయోజనాలు, విధి విధానాలపై రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూ పరిపాలన అధికారుల నుంచి కొంత సమాచారం తీసుకుని పరిశీలించారు. సర్వేకు సంబంధించి మరిన్ని వివరాలను నివేదించాలని ఆదేశించారు. దీంతో రెవెన్యూ అధికారులు ఒక నివేదికను తయారు చేస్తున్నారు.
గత అనుభవాల నేపథ్యంలోనే…
గత ప్రభుత్వం రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో పైలట్ ప్రాతిపదికన భూ సర్వేలు. నిర్వహించింది. గ్రామ స్థాయిలో ఉన్న భూమి, దస్త్రాల్లో ఉన్న విస్తీర్ణాన్ని ముందుగా పోల్చి డిజిటల్ సర్వే చేపట్టింది. సర్వేలో తేలిన వివరాలతో ఒక నివేదికను రూపొందించింది. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర డిజిటల్ సర్వే చేపట్టాలని నిర్ణయించింది.. తొలుత అన్ని జిల్లాల్లో ఒక్కో గ్రామంలో డిజిటల్ సర్వేకు ఆదేశాలు జారీ చేసింది. సర్వే సంస్థల గుర్తింపునకు (ప్రీ బిడ్) సమావేశం కూడా నిర్వహించింది. ఆ తరువాత ప్రభుత్వం ముందడుగు వేయలేదు. అనంతరం ధరణి సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టరేట్లలో ధరణి డెస్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అది కొన్ని జిల్లాలకే పరిమితమయింది. ఈ నేపథ్యంలో పాత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందుగా ఒక విధానాన్ని రూపొందించుకుని ముందుకు వెళ్లడానికి రెవెన్యూశాఖ సిద్ధమవుతోంది. వచ్చే నెల ఆరో తేదీ వరకు రాష్ట్రంలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉన్నందున రెండోవారంలో సమగ్ర సర్వే తదితర అంశాలపై ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం.
శాశ్వత ప్రయోజనాలే లక్ష్యంగా….
రాష్ట్రంలో దాదాపు 18 లక్షలకు పైగా అపరిష్కృత భూ సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమంలో వస్తున్న వాటిలో కూడా సగానికి పైగా ఇవే గురువారం నుంచి చేపట్టిన ప్రజాపాలనలోనూ ఇలాంటి దరఖాస్తులు వస్తున్నాయి. దీంతో భూ సమస్యలకు మూలాలు కనుగొనాలని రెవెన్యూశాఖ మంత్రి నిర్ణయించినట్లు తెలిసింది.
ధరణి పోర్టల్ ఏర్పాటు అనంతరం తలెత్తిన సమస్యలు ఒక రకమైనవి అయితే, క్షేత్రస్థాయిలో మరికొన్ని ఉండగా.. వీటిపై ఇప్పటికే ఆయన రెవెన్యూ చట్టాల నిపుణుల నుంచి పలు వివరాలు ఆరా తీశారు. రాష్ట్రంలో భూ సర్వే చేపట్టడానికి ఉన్న పరిస్థితులు, ఎలాంటి సర్వే విధానాలు అవలంభించాలనే దానిపై దృష్టిసారించారు. ఒక నివేదికను రూపొందించాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ ను ఆదేశించారు..