
గల్లీ కార్పొరేటర్‌లా కాకుండా.. కేంద్రమంత్రిగా మాట్లాడటం నేర్చుకో: బండి సంజయ్‌కి కేటీఆర్ కౌంటర్
అభండాలు వేసి, అబద్ధాలు ప్రచారం చేసి, ఇష్టం వచ్చినట్టు పిచ్చి ప్రచారాలు చేసిన రాజకీయ రాబంధులకు చెంప చెళ్లుమనిపించే విధంగా రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిందని.. ఈ తీర్పుతో గెలిచింది తెలంగాణ ప్రజలు..
తెలంగాణ రైతులు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులపాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన అన్ని కుట్రలకు హైకోర్టు తీర్పుతో ముగింపు పడిందని అన్నారు.
కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటూ పిట్టల దొరల మాదిరి అడ్డగోలుగా అబద్ధపు ప్రచారాలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలకు, సీఎం రేవంత్‌రెడ్డికి హైకోర్టు చెంప చెల్లుమనిపించే తీర్పు ఇచ్చిందన్నారు.
కూలింది కాళేశ్వరం కాదని.. కాంగ్రెస్ పార్టీ గారడీ మాటలు, కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రలు కూలిపోయాయని అన్నారు. అది పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కాదని.. పీసీసీ నివేదిక అని ఎప్పటి నుంచో చెబుతున్నామని.. కాంగ్రెస్ పార్టీ కావాలనే కాళేశ్వరంపై కుట్రలు చేస్తున్నదని ముందు నుంచీ చెబుతున్నామని అన్నారు.
అబద్ధాలతో అద్భుతాలు, నిజాన్ని చాలా కాలం దాచలేరని.. కాళేశ్వరం మహాత్మ్యాన్ని సైతం కనిపించకుండా చేయలేరని సూచించారు. రాహుల్‌గాంధీని తీసుకొచ్చి ఆ బ్యారేజ్ మీద నిలబెట్టి, అక్కడ ఉన్న ఒక పర్రెను చూపిస్తూ ఇది మొత్తం కూలిపోయింది, కొట్టుకుపోయిందని చెప్పి చేసిన చిల్లర ప్రచారం కొట్టుకుపోయిందన్నారు.
అంతిమ విజయం సత్యానిదే అని రుజువైందని చెప్పారు. గోబెల్స్‌ను మించి దుష్ప్రచారం చేసిన ధూర్తులందరికీ గుణపాఠం తప్పలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ తీర్పుతో సిగ్గు తెచ్చుకొని వెంటనే కాళేశ్వరానికి మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ కుట్రల వల్లే కూలింది.. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ దుర్మార్గులే ఏదో కుట్ర చేసి ఉంటారని.. ఆ విషయం కూడా నిలకడగా తెలుస్తుందని కేటీఆర్ అన్నారు.
రూ. 94వేల కోట్ల ప్రాజెక్టులో రెండు పిల్లర్లు కూలి రూ.400 కోట్లు మరమ్మతులకు అవసరమయ్యాయని.. కాంట్రాక్టింగ్ ఏజెన్సీ సంస్థనే తిరిగి కడతామన్నా వారిని బెదిరించి మరి అడ్డుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి ఇన్ని రోజులపాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై అడ్డగోలుగా కుట్రలు చేశారని మండిపడ్డారు.
గోదావరి నది ఉన్నంత కాలం కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటుందని.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన చరిత్ర కేసీఆర్‌ది అని అన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి తమ పార్టీపై, తమపై కోపం ఎన్ని విచారణలైనా చేసుకోండి కానీ రైతులను ఇబ్బంది పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు.
దుష్ప్రచారాలు చేస్తూ గాసిప్స్‌పై దృష్టి పెట్టకుండా గవర్నెన్స్ మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఇప్పటికైనా యాక్టింగ్ బంద్ చేసి వాటర్ లిఫ్టింగ్ మొదలు పెట్టాలని సూచించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆగమేఘాల మీద స్పందించిన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం, ఎందుకు కాంగ్రెస్ హయాంలో కూలిన ప్రాజెక్టులపై స్పందించలేదని నిలదీశారు. రేవంత్‌రెడ్డి ఎన్డీఏ భాగస్వామిలా మారిపోయారని.. ఆయన ఒక హైబ్రిడ్ ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు.
పొద్దున్న కాంగ్రెస్ పాట పాడుతూ, సాయంత్రం బీజేపీతో కలిసిపోతున్నారని.. ఏనాటికైనా కాంగ్రెస్‌ను 15 కిలోమీటర్ల లోపల బొందపెట్టి, ఆ పార్టీ మళ్లీ కోలుకోకుండా చేసేది రేవంత్‌రెడ్డే అని పేర్కొన్నారు.
చివరకు ఆయన బీజేపీలో చేరడం ఖాయమని అన్నారు. కసబ్ ఏ విధంగా అయితే కెమెరాలకు దొరికిపోయాడో, రేవంత్‌రెడ్డి సైతం కెమెరాల సాక్ష్యంగా దొరికిపోయిన ఓటుకు నోటు దొంగ అని మండిపడ్డారు.
అలాంటి కేసుకుని బీజేపీ పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పెద్దలకు మూటలు అందుతున్నాయని ఆరోపిస్తుంటే, ఆ మూటలను పట్టుకోవాల్సిన బాధ్యత కేంద్ర హోంమంత్రిది కాదా అని ప్రశ్నించారు.
ఆయన కరీంనగర్ గల్లీల్లో కార్పొరేటర్ లా మాట్లాడటం మానేసి తన పదవికి తగ్గట్టుగా వ్యవహరించాలని హితవు పలికారు. కేంద్రానికి దమ్ముంటే తెలంగాణ నుంచి ఏఐసీసీకి వెళ్తున్న ప్రతి పైసాను పట్టుకోవాలని సవాల్ విసిరారు.
అమృత్ పథకం నుండి సింగరేణి వరకు ప్రతి విషయంలో స్కామ్ జరుగుతుంటే, కిషన్ రెడ్డి మౌనంగా ఉంటూ కాంగ్రెస్ మంత్రులతో కలిసి తిరుగుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. అలాగే.. రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ నైతిక మద్దతు తెలుపుతున్నదని కేటీఆర్ ప్రకటించారు.
రేవంత్ అన్నట్లు తమకు ప్రతిపక్ష హోదా రాదని.. ముమ్మాటికీ అధికార పక్షహోదానే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు కాళేశ్వరంపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్‌కు పుష్పగుచ్చం అందించి మిఠాయి తినిపించారు.




