కేటీఆర్ తీరు బాధాకరం…
ఓటమితో మతి భ్రమించి మాట్లాడుతున్నారు
నెల రోజులు కూడా కానీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు
పదేండ్లు మీరు చేసిన ప్రగతి చూసే ప్రజలు బుద్ధి చెప్పారు
హామీలు మరిచిపోయే చరిత్ర బీఆర్ఎస్ దే
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్
కేటీఆర్ తీరు బాధాకరమని ఓటమి తర్వాత మతి భ్రమించి మాట్లాడుతున్నారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ అన్నారు.
గురువారం స్థానికంగా ఆయన మాట్లాడుతూ…కెటిఆర్ మాటలు అవివేకంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా నెలరోజులు కూడా కాలేదు అప్పుడే కేటీఆర్ కాంగ్రెస్ వి 420 హామీలను అనడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు.
2014 అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన తర్వాత ఆనాడు ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ హామీలపై ప్రశ్నిస్తే ఇప్పుడే పుట్టిన బిడ్డ అంటూ కాలయాపన చేశారని గుర్తు చేశారు. ముందస్తు ఎన్నికల్లో భాగంగా 2018లో రెండవ దఫా ఎన్నికల్లో గెలిచి మంత్రివర్గ విస్తరణకే టిఆర్ఎస్ కు నెల రోజులు టైం పట్టిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు శ్రీకారం చుట్టిందని తెలిపారు.
కేటీఆర్ ప్రజాతీర్పును అంగీకరించుకోని స్థితిలో ఉండి విమర్శలు చేస్తున్నారని హితవు పలికారు. దళిత ముఖ్యమంత్రి, మూడేకరాల భూమి, నిరుద్యోగ భృతి, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, కేజీ టు పీజీ విద్య హామీల పేరుతో పదేళ్లుగా అధికారంలో ఉండి ఏ ఒక్కటి కూడా నెరవేర్చని బిఆర్ఎస్ (టిఆర్ఎస్) వే అసలైన 420 హామీలని దుయ్యబట్టారు.
పదేళ్లలో బిఆర్ఎస్ చేసిన అవినీతిని, అబద్ధపు హామీలను ప్రజల గ్రహించి కాంగ్రెస్ కు పట్టం కట్టారని కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని వంద రోజుల్లో నెరవేరుస్తామని చెప్పడం జరిగిందని కానీ కేటీఆర్ అత్యుత్సాహంతో సరిగ్గా నెల రోజులు కూడా కానీ కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని అన్నారు.
కాంగ్రెస్ అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీల పథకానికి మంచి ప్రజాస్పందన లభిస్తుందని దాని తప్పుదోవ పట్టించేందుకు కేటీఆర్ 420 వేషాలు వేస్తున్నాడని విమర్శించారు.
కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని ఖచ్చితంగా నెరవేర్చడంతో పాటు గత టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలను కూడా బయట పెట్టడం జరుగుతుందని అన్నారు. ఇకనైనా కేటీఆర్ ప్రభుత్వంపై అవాకులు చవాకులు మాని ప్రజా సంక్షేమానికి తగిన విధంగా సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు.