మంత్రి సీతక్క ప్రెస్‌మీట్‌లో కలకలం
ప్రభుత్వం మారినప్పటికీ.. హైదరాబాద్ వాసుల కరెంటు కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించట్లేదు. కొంతకాలంగా తరచూ విద్యుత్ కోతలు జంటనగరాలను వేధిస్తూ వస్తోన్నాయి.
ఈ విద్యుత్ కోతల ప్రభావం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం కాలేదు. తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఏర్పడిందనడానికి ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న ఉదంతాలే నిదర్శనం.
వేసవి కాలం ఇంకా ఆరంభం కావడానికి ముందే కోతల ఇక్కట్లు మొదలయ్యాయని, వీటి తీవ్రత మున్ముందు మరింత పెరిగే అవకాశం లేకపోలేదనే అంచనాలు ఉన్నాయి.
తాజాగా.. మంత్రి సీతక్కకూ కరెంట్ కష్టాలు తప్పలేదు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా కరెంటు సరఫరా స్తంభించిపోయింది.
దీనితో కొద్దిసేపు ఆమె చీకట్లో గడపాల్సి వచ్చింది. ప్రెస్ మీట్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. హైదరాబాద్ గాంధీ భవన్‌లో ఇవాళే ఈ ఘటన చోటుచేసుకుంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పరిణామాలపై సీతక్క మాట్లాడుతున్న సమయంలో ఉన్నట్టుండి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని నిమిషాల పాటు చీకట్లో గడపాల్సి వచ్చింది.
కొందరు విలేకరులు తమ మొబైల్ ఫోన్ ఫ్లాష్ లైట్లను ఆన్ చేశారు. విద్యుత్ సరఫరా గాంధీభవన్‌లో మాత్రమే స్తంభించిందని.. సిటీలో ఎక్కడా లేదని మంత్రి వివరణ ఇచ్చుకున్నారు
అధికారంలో ఉంటూ.. హైదరాబాద్ మెట్రో సిటీలోని పార్టీ కేంద్ర కార్యాలయం గాంధీ భవన్‌లోనే విద్యుత్ సరఫరా స్తంభించిపోతే.. ఇక గ్రామాల్లో కరెంటు కోతల పరిస్థిితి ఇంకెంత తీవ్రంగా ఉందోనంటూ బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పవర్ కట్‌పై బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం మీమ్స్ సంధిస్తోంది.