రెచ్చిపోతున్న ఇసుక మాఫియా…
ఫారెస్ట్ అధికారులను ఢీకొట్టి పోయేందుకు యత్నం
అక్రమ ఇసుక రవాణాను అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నం చేసిన అటవీ శాఖ సిబ్బంది పైనే ట్రాక్టర్ తో ఢీ కొట్టడం జరిగింది.
ఇల్లందు ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని టేకులపల్లి మండలం నుంచి కొన్నాళ్లుగా ట్రాక్టర్ల ద్వారా ఇల్లెందుకు రాత్రి, తెల్లవారుజామున యథేచ్చగా ఇసుక మాఫియా కొనసాగుతుంది. దీంతో అటవీ శాఖ సిబ్బంది 9వ మైల్ తండా రోళ్లపాడు సమీపంలో 2 ట్రాక్టర్లను పట్టుకున్నారు.
ఇల్లెందు ఎఫ్డిఓ కర్ణావత్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం తెల్లవారు జామున ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం రావడంతో కొమరారం ఎఫ్ఆర్వో, సిబ్బందిని పంపడం జరిగిందని తెలిపారు.
టేకులపల్లి మండలంలో ఇసుక ట్రాక్టర్లను పట్టుకోవాలని ప్రయత్నించగా ఒక ట్రాక్టర్ తప్పించుకునే క్రమంలో రివర్స్ తిప్పుతూ అటవీ శాఖకు చెందిన కారును ఢీకొట్టినట్లు పేర్కొన్నారు. వాహనంలో ఉన్న సిబ్బంది చాకచక్యంగా తప్పించుకోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు.
అప్రమత్తమైన సిబ్బంది 2 ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని డిపోకు తరలించినట్లు తెలిపారు. ఇసుక ఎక్కడి నుంచి వచ్చిన ఇల్లందుకు రవాణా చేయడం నేరమేనని,
బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇకపై ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.