గణనీయంగా పడిపోయిన మిర్చి ధర
రెండు రోజుల్లో క్వింటాకు రూ.2వేల తగ్గింపు
గరిష్ట ధర రూ.21 వేలు.. రూ.18వేలతోనే కొనుగోళ్లు
ధర గిట్టుబాటు కాక పంట తిరిగి తీసుకెళ్లిన రైతులు
అదనపు కలెక్టర్ తనిఖీ చేసిన
రెండోరోజే వ్యాపారుల మాయాజాలం
మిర్చి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, మార్కెట్‌లో మెరుగైన ధర దక్కేలా అధికారులు పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్‌నాయక్ ఆదేశించారు.
కలెక్టరేట్‌లో ఆయన మార్కెటింగ్, ఉద్యానవన, పౌరసరఫరాల, వ్యవసాయ, సహకార శాఖల అధికారులతో మిర్చి కొనుగోళ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ మిర్చి నాణ్యత ఆధారంగా మద్దతు ధర చెల్లించేలా చూడాలని తెలిపారు. మార్కెటింగ్ శాఖ అధికారి ఎం.ఏ.అలీమ్, ఉద్యాన శాఖ అధికారి అనసూయ, డీఎస్‌ఓ శ్రీలత, ఏడీఏ సరిత, అధికాఉలు రమణ, బజార్, చంధ్రశేఖర్, భాస్కర్, ప్రసాద్, ఆంజనేయులు, చాంబర్ బాధ్యులు చిన్ని కష్ణ, మెంతుల శ్రీశైలం, చిన్న వెంకటేశ్వర్లు, మన్నెం కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
మిర్చి ధర ఒక్కసారిగా పతనమైంది. రెండు రోజుల వ్యవధిలోనే క్వింటా రూ.2 వేలు తగ్గింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం క్వింటా మిర్చికి రూ.23వేల ధర పలకగా సోమవారానికి రూ.21వేలకు పడిపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. మార్కెట్‌కు రైతులు తీసుకొచ్చే మిర్చిలో నాణ్యమైన సరుకును గుర్తించి జెండా పాట ధర నిర్ణయిస్తారు. ఇదే ధర వస్తుందని రైతులు ఆశిస్తే రెండు, మూడు లాట్లకు మాత్రమే చెల్లించిన వ్యాపారులు ఆతర్వాత నాణ్యత లేదని, ఎగుమతులు పడిపోయాయని చెబుతూ ధర తగ్గించేశారు. మార్కెట్‌లో సోమవారం జెండాపాటలో క్వింటా మిర్చికి రూ.21వేల ధర నిర్ణయించగా, మోడల్ ధర రూ.18,500గా, కనిష్ట ధర రూ.7వేలుగా పలికింది. అయితే రూ.15వేల నుంచి రూ.18వేలకు మించి ధర రాకపోవడంతో శుక్రవారం మాదిరి ధర వస్తుందని ఆశించిన రైతులు పలువురు సరుకు తిరిగి తీసుకెళ్లగా మరికొందరు మార్కెట్‌లోనే నిల్వ చేశారు. శనివారమే అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, అధికారులు మార్కెట్‌లో పరిశీలించి రైతులకు ధరలో న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించినా పరిస్థితిలో మార్పు రాకపోవడం గమనార్హం.
విక్రయాలు ఊపందుకోవడంతో దందా
మిర్చి విక్రయాలు నాలుగైదు రోజులుగా పెరిగాయి. కొంతకాలంగా క్వింటా ధర రూ.23వేల నుంచి రూ.24వేల వరకు పలుకుతుండడంతో నిత్యం 20వేలనుంచి 30 వేల బస్తాల మిర్చి తీసుకొస్తున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు దందాకు తెర తీసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆర్డర్లు లేవని చెబుతూ ధర తగ్గంచగా, వ్యాపారులంతా సిండికేట్ అయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు.
ఆర్డర్లు లేవట..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పండించే ‘తేజా’ రకం మిర్చికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. చైనా, మలేసియా, సింగపూర్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి వ్యాపారులకు ఆర్డర్లు వస్తాయి. కానీ ప్రస్తుతం తమకు ఆర్డర్లు లేవని వ్యాపారులు చెబుతున్నారు. పలువురు వ్యాపారులు కొనుగోళ్లుకు ముందుకు రాకపోవడంతో మిగతా వారు ధర తగ్గించి కొనుగోలు చేసి నిల్వ పెట్టాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. రూ.15వేల నుంచి రూ.16వేల ధరతో కొనుగోలు చేసి మంచి ధర పలికినప్పుడు విక్రయించాలనే భావనతో ఉన్నట్లు సమాచారం.
లబోదిబోమంటున్న రైతులు
మిర్చి ధర పడిపోవటంతో రైతులు లబోదిబోమంటున్నారు. రూ.20వేల వేల నుంచి 23 వేల వరకు ధర వస్తుందని ఆశిస్తే రూ.15వేల నుంచి రూ.18వేలకు మించి పలకలేదు. అసలే ఈ ఏడాది తెగుళ్లు, తామర పురుగుతో పంట కోల్పోగా ఇప్పుడు ధర తగ్గించడం రైతులను మరింత ఆవేదనకు గురిచేసింది. ఇదిలా ఉండగా ఆర్మూర్ వంటి రకాలకు నాణ్యత పేరిట రూ.10వేల నుంచి రూ.15 వేలకు మించి ధర చెల్లించలేదు. నిన్నమొన్నటి వరకు తాలు మిర్చికి సైతం రూ.14 వేల వరకు ధర పలకగా.. సోమవారం కూడా గరిష్టంగా రూ.10 వేల ధర పలికింది.
రెండు రోజుల్లో క్వింటాకు రూ.2వేల తగ్గింపు
గరిష్ట ధర రూ.21 వేలు.. రూ.18వేలతోనే కొనుగోళ్లు
ధర గిట్టుబాటు కాక పంట తిరిగి తీసుకెళ్లిన రైతులు
అదనపు కలెక్టర్ తనిఖీ చేసిన
రెండోరోజే వ్యాపారుల మాయాజాలం