నందమూరి కుటుంబంలో మరోసారి బయటపడ్డ విభేదాలు
హైదరాబాద్ : నందమూరి కుటుంబం లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. గత కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ ఆయన బాబాయ్ నందమూరి బాలకృష్ణ మధ్య గ్యాప్ ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.తాజాగా ఆ ప్రచారానికి బలం చేకూర్చే ఘటన ఒకటి చోటు చేసుకుంది.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా గురువారం ఉదయం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు నివాళుల ర్పించారు.
ఇక ఈ తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, కల్యాణ్ రామ్ నివాళుల ర్పించారు. మరోవైపు అక్కడికి తారక్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జూనియర్ ఎన్టీఆర్‌కు మద్దతుగా నినాదాలు చేశారు.
ఆ తర్వాత కొద్దిసేపటికి బాలకృష్ణ అతడి కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులతో కలిసి చేరుకున్నారు. ఆయన తన తండ్రికి అంజలి ఘటించారు.
ఇంతవరకూ బాగానే ఉన్నా.. బాలకృష్ణ వెళ్లిపోయిన తర్వాత ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన తారక్ ఫ్లెక్సీలను బాలయ్య అభిమానులు తొలగించడం ఇప్పుడు వివాదానికి దారితీసింది.
బాలకృష్ణ సూచనల మేరకే వీటిని తొలిగించారనే ప్రచారం జరుగుతోంది. వాటిని వెంటనే తొలగించాలంటూ బాలకృష్ణ ఆదేశిస్తున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి.
దీనిపై తారక్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత కాలంగా టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.