నెంబర్ ప్లేట్ తీసుకొస్తేనే బండి ఇచ్చేది – ఖమ్మంలో 60 ద్విచక్ర వాహనాలు సీజ్
ఖమ్మంలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. సరైన నెంబర్ ప్లేట్ లేకుండా రోడెక్కుతున్న యువతకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ద్విచక్రవాహనాలను సీజ్ చేసి సరైన నెంబర్ ప్లేటు తీసుకొచ్చిన వారికే వాహనాలు తిరిగి ఇస్తున్నారు.
నెంబర్ ప్లేట్లతో వాహనదారులు
మీ బండికి నెంబర్ ప్లేట్ లేదా? అయితే ఏదో ఒక టైమ్ లో మీరు పోలీసులకు దొరికిపోయినట్లే. అలా దొరికితే ఊరికే వదలరండోయ్..! బండి లాక్కుని మీరు నెంబర్ ప్లేట్ తయారు చేయించి తీసుకొచ్చి చూపిస్తేనే మీ బండి మీ చేతికొస్తుంది.
అలాగే ఒకవేళ బండి నడిపే వ్యక్తికి లైసెన్స్ లేకపోతే సంబంధిత వాహన పత్రాలు చూపిస్తేనే బండిని విడుదల చేస్తారు. అంతేకాదు.. వెంటనే లైసెన్స్ తీసుకునేలా చర్యలు చేపడుతున్నారు. ఇది ఖమ్మం జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్.
నెంబర్ ప్లేట్ పై నెంబర్ లేకుండా సినిమా హీరోలు, హీరోయిన్ ల ఫొటోలను, ఇష్టారీతిన బొమ్మలను స్టిక్కరింగ్ చేస్తున్న సంస్కృతి ఖమ్మంలో బాగా పెరిగిపోయింది. కొందరు అసలు నెంబర్ ప్లేట్ లేకుండానే వాహనాలను నడుపుతున్న వైనం ఖమ్మంలో కనిపిస్తోంది.
ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఇటీవలే కొత్తగా బాధ్యతలు చేపట్టిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్ నడుం బిగించారు. ఆయన ఆదేశాల మేరకు మోటారు వాహన చట్టం నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝలిపించారు.
నగరంలోని పలు కూడళ్లలో ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించి 60 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో లైసెన్సు, నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న 60 వాహనాలు దొరికాయి. దీంతో వాటిని పోలీసులు సీజ్ చేశారు.
నెంబర్ ప్లేట్ తెస్తేనే..
సీజ్ చేసిన వాహనదారులకు ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సారంగపాణి కౌన్సిలింగ్ నిర్వహించారు. నెంబర్ ప్లేట్ తీసుకొని వచ్చిన వారికే వాహనాలను తిరిగి ఇస్తామని చెప్పారు. దీంతో వాహనదారులు చేసేదిలేక నెంబర్ ప్లేట్లను తీసుకొచ్చి తమ వాహనాలను తీసుకెళ్లారు.
నిబంధనల ప్రకారం వాహనదారులు తప్పనిసరిగా తమ వాహనాలకు ముందు, వెనుక వైపు నెంబర్ ప్లేట్ కలిగి ఉండాలని సీఐ తెలిపారు. ఇకపై తరచూ తనిఖీలు నిర్వహిస్తామని నెంబర్ ప్లేట్ లేకున్నా, వాహనానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు చూపించకపోయినా సీజ్ చేస్తామని హెచ్చరించారు.
స్టైల్, వెరైటీ, ఫ్యాషన్ పేర్లతో తమ బైక్‌లకు కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లను మార్చి న్యూసెన్స్ క్రియేట్ చేసే వారిపై కూడా దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు.
అందులో భాగంగా ఇటీవల సైలెన్సర్స్ విక్రయించే షాపులు, సైలెన్సర్స్ బిగించే మెకానిక్ షాపుల యజమానులకు సైతం కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు.
సైలెన్సర్ల నుంచి వచ్చే శబ్దాల వల్ల తోటి వాహనదారులు, స్థానికులు భయబ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.
కొన్ని సమయాల్లో పెద్ద వయస్కులు వాహనం కంట్రోల్ తప్పి ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితులను కల్పించే వాహనదారులపై చట్ట పరమైన చర్యలు తప్పవని సీఐ సారంగపాణి హెచ్చరించారు.