మేం గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ బంగాళాఖాతంలోకే : తుమ్మల నాగేశ్వరరావు సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం కాంగ్రెస్​ఎమ్మెల్యేలను, కార్యకర్తలను కొనే శక్తి ఏ పార్టీకి లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.బుధవారం ఖమ్మం క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన పార్టీ బూత్​లెవల్​కార్యకర్తల సమావేశంలో మంత్రి తుమ్మల పాల్గొని మాట్లాడారు. "కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని జీర్ణించుకోలేక ప్రత్యర్థులు అనేక అవాకులు, చవాకులు పేలుతున్నారు. ఎమ్మెల్యేలను కొంటాం.. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. సర్పంచ్ ఎన్నికలు ఇప్పట్లో …

మేం గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ బంగాళాఖాతంలోకే : తుమ్మల నాగేశ్వరరావు

సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం

కాంగ్రెస్​ఎమ్మెల్యేలను, కార్యకర్తలను కొనే శక్తి ఏ పార్టీకి లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.
బుధవారం ఖమ్మం క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన పార్టీ బూత్​లెవల్​కార్యకర్తల సమావేశంలో మంత్రి తుమ్మల పాల్గొని మాట్లాడారు. "కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని జీర్ణించుకోలేక ప్రత్యర్థులు అనేక అవాకులు, చవాకులు పేలుతున్నారు. ఎమ్మెల్యేలను కొంటాం.. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది..

అంటూ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు. కానీ మమ్మల్ని, మా పార్టీ ఎమ్మెల్యేలను కొనే శక్తి, సామర్థ్యాలు మీకు లేవు, మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ బంగాళాఖాతంలో కలిసి పోతుంది. పార్టీ కోసం కష్టపడ్డ ఏ ఒక్కరికీ అన్యాయం జరగనివ్వను.

ఎవరైనా నిజంగా కాంగ్రెస్​లోకి రావాలనుకుంటే.. అది మీ(కార్యకర్తల) ద్వారానే వస్తారు.. తప్పించి నా ద్వారా కాదు. ఒకరిద్దరు దొంగతనంగా వచ్చి నన్ను కలుస్తున్నారు.

మీ గ్రామంలోని కాంగ్రెస్​అధ్యక్షుడిని కలిశాకే నా దగ్గరకు రమ్మని చెబుతున్నాను. మొన్నటిదాకా ఎవరైతే అధికారం ఉందన్న మదంతో కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వారిని మాత్రం ఓ చూపు చూస్తా.

జిల్లాలోని ఇద్దరు మంత్రులు, మిగిలిన ఎమ్మెల్యేలకు నా పద్ధతి ఇంతే అని ఇప్పటికే చెప్పినా..' అని తుమ్మల చెప్పారు. పదేండ్లు అధికారంలో లేకపోయినా, బీఆర్ఎస్​నాయకులు అక్రమ కేసులు బనాయించినా, చెక్కు చెదరని ఆత్మ విశ్వాసంతో కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలను ఆయన అభినందించారు.

బీఆర్ఎస్​ ప్రభుత్వంలో మాదిరిగా తాబేదార్ల కోసం, పక్కన తిరిగే పనికిమాలిన వాళ్ల కోసం పథకాలు ఉండవన్నారు. పథకాలు నిజమైన పేదలకు అందినప్పుడే తనకు సంతృప్తి ఉంటుందని చెప్పారు.

ఈ ఏడాది వరుసగా ఎన్నికలు ఉంటాయని, కార్యకర్తలు అందరూ అలర్ట్ గా ఉండాలని సూచించారు. సమావేశంలో ఖమ్మం సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు జావెద్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధాకిశోర్ పాల్గొన్నారు.

Updated On 25 Jan 2024 12:55 PM IST
cknews1122

cknews1122

Next Story