యుద్ధానికి నేను రెడీ. మీరు రెడీనా… షర్మిల సవాల్
రాజశేఖర్‌రెడ్డి బిడ్డగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు నేను ఎపికి వచ్చాను.
తెలంగాణా మెట్టినిల్లయితే ఎపి పుట్టినిల్లు. ఇక్కడ ఎవరూ భయపడేది లేదు. యుద్ధానికి నేను రెడీ… మీరు రెడీనా అని’ పిసిసి అధ్యక్షులు వైఎస్. షర్మిల సవాలు విసిరారు.
నెల్లూరు, ఒంగోలులో నిర్వహించిన పార్టీ సమావేశాల్లో ఆమె మాట్లాడారు. వైఎస్.రాజశేఖర్‌రెడ్డి పాలనకూ, జగనన్న పాలనకూ నక్కకు నాగలోకానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉందన్నారు. ఆయన వారసులుగా చెప్పుకుంటూ ఏం చేశారో ఆలోచించాలన్నారు.
సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, సజ్జల రామకృష్టారెడ్డి అని ఎద్దేవా చేశారు. మద్యపాన నిషేధం అమలు చేశాకే ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని చెప్పిన జగనన్న ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ రాలేదని, జిల్లాకు ఓ ఎయిర్‌పోర్టు, బోయింగులు తిప్పుతామన్నారు… అన్నీ గాలికి పోయాయని విమర్శించారు. ‘వైసిపిలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి లేరు..
ఇదొక నియంత పార్టీ. ప్రజా సమస్యలు పట్టడం లేదు. ప్రజల ప్రయోజనాలను బిజెపికి తాకట్టుపెట్టారు. వైఎస్.రాజశేఖర్‌రెడ్డి బిజెపికి వ్యతిరేకం.
ఎందుకంటే బిజెపి మతతత్వపార్టీ. ఒక మతాన్ని రెచ్చగొట్టడం.. మరో మతాన్ని అవమానించడం. ఇదే బిజెపి రాజకీయ నైజం’ అని ధ్వజమెత్తారు.
జగనన్నతోపాటు చంద్రబాబు, పవన్ కలిసి రాష్ట్ర ప్రయోజనాలను బిజెపికి తాకట్టుపెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో బిజెపి అంటే బాబు, జగన్, పవన్ అంటూ చమత్కరించారు.
వీళ్లకు ఓట్లేస్తే బిజెపికి వేసినట్లేనని, వీరికి ఓట్లేయడం మళ్లీ బిజెపికి బానిసలు కావడం ఎందుకని ప్రశ్నించారు. వెలిగొండ ప్రాజెక్టును వైఎస్ 60 శాతం పూర్తిచేస్తే… తర్వాత చంద్రబాబు గానీ, ఇప్పుడు జగన్‌గానీ ఎందుకు పూర్తిచేయలేదన్నారు.
గంగవరం పోర్టును 20 ఏళ్లలో ప్రభుత్వానికి వచ్చేలా వైఎస్ నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు దాన్ని అమ్మగా వచ్చిన రూ.600 కోట్లను వేరే పోర్టులకు వినియోగించినట్లు చెబుతున్నారన్నారు. ఐదేళ్లలో రూ. ఎనిమిది లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఎందుకు ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. రూ.
55వేల కోట్లు ఖర్చుపెడితే పోలవరం పూర్తయ్యేది కదా? అని అన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి లక్షా ఎనబై వేల కోట్ల రూపాయలు అప్పు ఉంటే, టిడిపి మరో లక్షా ఎనబై వేల కోట్లు టిడిపి అప్పు చేసిందని, వైసిపి ఏకంగా రూ. ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు.
ప్రస్తుతం రాష్ట్రం రూ.11.60 వేల కోట్లు అప్పుల్లో ఉందని తెలిపారు. ఇంత అప్పు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఎంత మేరకు అభివృద్ధి చేశారని ప్రశ్నించారు.
వైఎస్ హయాంలో పూర్తిచేసిన గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్వహణ కోసం కూడా నిధులు ఇవ్వనందునే దాన్ని గేట్లు కొట్టుకుపోయాయన్నారు.
మాజీ ఎంపి జెడి. శీలం, ప్రసాదరావు, శ్రీపతిప్రకాశం మాట్లాడారు. అంతకుముందు కాంగ్రెస్‌పార్టీ నేతలతో కలిసి గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించి దెబ్బతిన్న గేట్లను షర్మిల పరిశీలించారు.