పాలన పరుగు పెట్టాలి..!
- అధికారులు మొద్దు నిద్రను వీడాలి
- ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందేలా దృష్టి సారించాలి
- లబ్ధి చేకూరలేదని ఫిర్యాదు అందితే అధికారుల్నే బాధ్యులను చేస్తాం
- రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
- 59, 60,1వ డివిజన్లలో ఆకస్మిక పర్యటన
– బైక్ పై కలియతిరుగుతూ సమస్యల పరిశీలన - సీకే న్యూస్ ప్రతినిధి
ఖమ్మం : పాలన పరుగులు పెట్టాలనే లక్ష్యంతో రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అడుగులు ముందుకు వేస్తున్నారు. ప్రధానంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో తరచూ ఆకస్మిక పర్యటనలు చేస్తూ ప్రభుత్వ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా 59వ డివిజన్ దానవాయిగూడెం, 60వ డివిజన్ రామన్నపేట, ఒకటవ డివిజన్ కైకొండాయిగూడెంలో బుధవారం ఉదయం 06.45 నిమిషాల నుంచి అకస్మాత్తు పర్యటన చేశారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి ద్విచక్రవాహనంపై ఆ డివిజన్లన్నీ కలియతిరిగారు.
ప్రధానంగా దానవాయిగూడెం, రామన్నపేట డివిజన్లలోని డంపింగ్ యార్డు, ఇళ్లు, రోడ్ల సమస్యలను పరిశీలించారు. కైకొండాయిగూడెంలో శ్మశాన వాటిక, సెంట్రల్ లైటింగ్,డ్రెయినేజీ సమస్యలు ఉన్నాయని గుర్తించారు.
వీటితో పాటు మరికొన్ని సమస్యలను స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. వీటన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వంలో ఏ ఒక్కరూ ఇబ్బందులు పడకుండా చూడటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
మంత్రి రాకతో ఉరుకులు.. పరుగులు పెట్టిన అధికారులు
ఉదయాన్నే పై డివిజన్లలో మంత్రి పొంగులేటి పర్యటన ఉందని ఆకస్మిక సమాచారం అందడంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో పాటు ఆయా శాఖల అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు.
ద్విచక్ర వాహనంపై కార్పొరేషన్ కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి డివిజన్లలో కలియ తిరుగుతూ స్థానిక ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి చొరవ చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అధికారులు మొద్దు నిద్ర వీడి ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందేలా దృష్టిసారించాలని సూచించారు. ఏ ఒక్క అర్హుడూ తనకు ప్రభుత్వ ఫలం అందలేదని ఫిర్యాదు చేసినా దానికి అధికారుల్నే బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. మంత్రి పర్యటనతో తమ డివిజన్లలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.