బీఆర్ఎస్ లో ఆత్మ క్షోభకు గురయ్యా : తాటికొండ రాజయ్య
హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఎంపీ టికెట్ విషయంలో తనకు పార్టీ హైకమాండ్ నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన… బీఆర్ఎస్ ను వీడారు.
కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 10న ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. ఆయన రాజీనామాతో వరంగల్ లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది.
ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీలో తాను అసంతృప్తితో ఉన్న మాట నిజమేనని చెప్పారు. పార్టీకి ఎంతో సేవ చేసినా తనకు సరైన గుర్తింపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ లో ఆత్మ క్షోభకు గురయ్యానని చెప్పారు.
పార్టీ అధినేతను కలిసే అవకాశం కూడా తనకు రాలేదని విమర్శించారు. పార్టీ మారే విషయంపై తన అనుచరుల నుంచి తనకు ఎంతో ఒత్తిడి ఉందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ విధానాలు కూడా తనకు నచ్చడం లేదని రాజయ్య అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పడం సరికాదని చెప్పారు. గతంలో తాను 15 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని… కాంగ్రెస్ లో ఉండే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడానని తెలిపారు. తన అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.