వృద్ధ దంపతులను కారులో ఎక్కించుకొని నిలువు దోపిడీ!
ఖమ్మం జిల్లా వైరాలో దారుణ ఘటన జరిగింది. రోడ్డుపై వేచియున్న వృద్ధ దంపతులను కారులో ఎక్కించుకొని నిలువు దోపిడీకి పాల్పడ్డారు అగంతకులు. అనంతరం వారిని తల్లాడ దగ్గర్లో దింపి పరారయ్యారు.వృద్ధ దంపతుల వద్ద ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసు, రూ.5 వేలను దోచుకున్నారు దుండగులు.
తల్లాడ పోలీస్ స్టేషన్ లో వృద్ధ దంపతులు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.దొంగతనాలకు మరో భాష్యం చెప్పే విధంగా దుండగులు ఈ చోరీ చేయడం విశేషం.
బొమ్మ బొరుసు ఆట పేరుతో ముందు వంద రూపాయలు వృద్ధ దంపతులకు వచ్చాయని ఆశ చూపి ఆ తర్వాత వారి దగ్గర ఉన్న సొత్తు మొత్తాన్ని కొల్లగొట్టారు. బాధిత వృద్ధ దంపతులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు వాంకుడోత్ కేతా నాయక్, బాలి శుక్రవారం మధ్యాహ్నం వైరాలోని లైన్స్ ఐ కేర్ హాస్పిటల్ లో కంటి పరీక్షలు చేయించుకునేందుకు వచ్చారు.
అక్కడ కంటి పరీక్షలు చేయించుకొని మందులు తీసుకున్న వారు తిరిగి పాపకొల్లు వెళ్లేందుకు వైరా బస్టాండుకు చేరుకున్నారు. బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ హోటల్లో వారు భోజనం చేసి బస్ కోసం బస్టాండ్ లోకి వెళ్తున్నారు. అయితే హోటల్ వద్ద నుంచి ఆ వృద్ధ దంపతులను దుండగులు ఫాలో అవుతూ రెక్కి నిర్వహించారు.
ఆ దంపతులు బస్టాండ్ లోకి వెళ్లాక దుండగులు ఎక్కడికి వెళ్లాలని వారిని ప్రశ్నించారు. దీంతో ఆ దంపతులు జూలూరుపాడు వెళ్లాలని సుమో వాహనంలో ఉన్న దొంగలకు తెలిపారు. తాము కొత్తగూడెం వైపు వెళ్తున్నామని చార్జీ లేకుండా ఉచితంగా తీసుకువెళ్తామని ఆ వృద్ధులను సుమోలో ఎక్కించుకున్నారు.
ఆ సమయంలో ఆ కారులో వృద్ధ దంపతులతో పాటు మరో ఐదుగురు ఉన్నారు. అయితే వైరా మండలం స్టేజీ పినపాక గ్రామం దాటగానే కారులో ఉన్న దుండగులు బొమ్మ బొరుసు ఆట ప్రారంభించారు.
ఆ కారులో ఓ దుండగుడు వాంకుడోత్ కేతానాయిక్ ను 50 రూపాయలు బదులు ఇవ్వాలని వెంటనే తిరిగి ఇస్తానని అడిగాడు. దీంతో కేతా నాయక్ 50 రూపాయలు బదులు ఇచ్చాడు. వెంటనే ఆట వేసి మీ 50 రూపాయలకు వంద రూపాయలు వచ్చాయని కేత నాయక్ కు ఆ దుండగుడు నగదును ఇచ్చాడు.
ఆ తర్వాత 10000 ఉంటే ఇవ్వండి ఆటలో గెలిస్తే డబుల్ వస్తాయని ఆగంతుకుడు కేతా నాయక్ కు తెలిపాడు. దీంతో ఆశతో తన వద్ద ఉన్న రూ.5000 ఆ దుండగుడికి ఇచ్చాడు.
అయితే మరోసారి బొమ్మ బొరుసు ఆట వేసి 5000 రూపాయలు ఆటలో పోయాయని ఆ దుండగుడు వృద్ధుడికి తెలిపాడు. అనంతరం వృద్ధురాలు బాలి మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు పెట్టి ఆట ఆడితే లక్ష రూపాయలు పందెం వస్తుందని ఆ దుండగుడు దంపతులను నమ్మించాడు. దీంతో బంగారు గొలుసును బాలి తీసి ఇచ్చింది.
ఆ తర్వాత ఆటలో గొలుసు కూడా పోయిందని ఆగంతకులు నమ్మబలికారు. వెంటనే కారులోని ఒక వ్యక్తి ఆ డబ్బులు, నాలుగు తులాల బంగారు గొలుసును తీసుకొని తల్లాడ గ్రామ శివారులో దిగిపోయాడు. కారు తల్లాడ దాటిన తర్వాత వృద్ధ దంపతులు అగంతకులతో గొడవపడ్డారు.
దీంతో కారులో ఉన్న మిగిలిన అగంతకులు ఆ వృద్ధ దంపతులను తల్లాడ లోని కల్లూరు రోడ్డులో కారు లోంచి బయటికి నెట్టి పరారయ్యారు. తాము మోసపోయామని గ్రహించిన వృద్ధ దంపతులు వైరా, తల్లాడ పోలీసులను ఆశ్రయించారు.
ఈ చోరీ విషయాన్ని తెలుసుకున్న వెంటనే వైరా సీఐ ఎన్. సాగర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దొంగలు చోరీ చేసిన బంగారు గొలుసు విలువ సుమారు రెండున్నర లక్షల రూపాయలు ఉంటుందని అంచనా.
వైరా ఏసీపీ రెహమాన్ ఆదేశాల మేరతో వైరా సీఐ ఎన్.సాగర్ ఆధ్వర్యంలో వైరా, తల్లాడ ఎస్ఐలు మేడా ప్రసాద్, వి.కొండలరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.