కాంగ్రెస్, బీఅర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ..
ఇల్లందు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
Ck news మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుపై అసమ్మతి వార్డు కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం ఈరోజు జరుగుతుండడంతో ఇన్ని రోజులు క్యాంపులో ఉన్న వార్డ్ కౌన్సిలర్లు మూకుమ్మడిగా మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్న నేపథ్యంలో ముగ్గురు వార్డు కౌన్సిలర్లను అధికార పార్టీకి చెందిన నాయకులు కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఘర్షణకు దిగారు.
ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెల్లాచెదురు చేశారు.
అధికార పార్టీ ఎమ్మెల్యే కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ చెరొక వైపు నిలబడి అవిశ్వాసంలో నెగ్గాలని ఒకరు, వీగిపోవాలని ఒకరు తమ అనువర్గాలతో పాచికలు వేశారు.
మాజీ ఎమ్మెల్యే హరిప్రియ భర్త హరిసింగ్ నాయక్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యాలయంకు చేరుకున్నారు.
ఇల్లందు మున్సిపల్ కార్యాలయం ముందు ఉద్రిక్తత కొనసాగుతోంది. మూడో వార్డు కౌన్సిలర్ కొక్కు నాగేశ్వరరావును ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఆయన అనుచరులు కిడ్నాప్ చేశారని మున్సిపల్ కార్యాలయం ముందు నాగేశ్వరరావు భార్య, కూతురు ఆందోళన చేస్తున్నారు.
బలవంతంగా తన భర్తను కాంగ్రెస్ వాళ్లు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లందుల్లో నేడు జరగనున్న అవిశ్వాసానికి ముందు ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలపడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు.
పోలీసులు సరైన భద్రత కల్పించకపోవడం వల్లే తమ భర్తను కాంగ్రెస్ వాళ్ళు బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళ్లారని నాగేశ్వరావు భార్య ఆరోపిస్తోంది. ఇల్లందు మున్సిపల్‌కి సంబంధించి మొత్తం 24 మంది కౌన్సిలర్లలో 19 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ,ముగ్గురు ఇండిపెండెంట్ లు ,ఒకరు సీపీఐ, ఒకటి న్యూ డెమోక్రసీ చెందిన కౌన్సిలర్ ఉన్నారు. అవిశ్వాసం నెగ్గాలంటే బీఆర్ఎస్ పార్టీకి 17 మంది కౌన్సిలర్లు అవసరం.