నకిలీ ఐడిఫ్రూఫ్‌లతో భారత్‌లో అక్రమ నివాసం - నలుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్‌..! నకిలీ ఐడి ప్రూఫ్‌లతో పాస్‌పోర్టులు పొందిన నలుగురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మంలో నలుగురు బంగ్లాదేశ్‌ వాసులు అక్రమంగా నివాసముంటున్నట్లు వెలుగులోకి వచ్చింది వీరంతా నకిలీ పత్రాలతో ఆధార్‌ సహా వివిధ ధ్రువపత్రాలు పొందిన విషయం నిర్థారణ అయ్యింది. వీరిలో ఇద్దరు పాస్‌పోర్టులు సైతం పొందడం గమనార్హం. ఖమ్మం పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ ఆదివారం ఓ ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు. నిందితులను …

నకిలీ ఐడిఫ్రూఫ్‌లతో భారత్‌లో అక్రమ నివాసం - నలుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్‌..!

నకిలీ ఐడి ప్రూఫ్‌లతో పాస్‌పోర్టులు పొందిన నలుగురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మంలో నలుగురు బంగ్లాదేశ్‌ వాసులు అక్రమంగా నివాసముంటున్నట్లు వెలుగులోకి వచ్చింది

వీరంతా నకిలీ పత్రాలతో ఆధార్‌ సహా వివిధ ధ్రువపత్రాలు పొందిన విషయం నిర్థారణ అయ్యింది. వీరిలో ఇద్దరు పాస్‌పోర్టులు సైతం పొందడం గమనార్హం.

ఖమ్మం పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ ఆదివారం ఓ ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు. నిందితులను మొహమ్మద్‌ నూర్‌నబీ (షేక్‌ నూర్‌నబీ) (32), మొహమ్మద్‌ సాగర్‌ (బోడ సాగర్‌) (24), షేక్‌ జమీర్‌ (మహమ్మద్‌ జమీర్‌) (30), మహమ్మద్‌ అమినూర్‌ మండల్‌ (26)గా గుర్తించామన్నారు.

వీరిలో మొదటి ఇద్దరికి సోదరి అయిన శాగురి ఖాతూన్‌ (శిల్ప) చాలా ఏళ్ల కిందట బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా ముంబయికి వచ్చి అక్కడ ఖమ్మం నివాసి అయిన బోడ రాములుతో సహజీవనం చేసింది. వీరికి ఒక బాబు (11) ఉన్నాడు.

ఆ తరువాత శిల్ప బంగ్లాదేశ్‌కు వెళ్లి తన సోదరులైన నూర్‌నబీ, మొహమ్మద్‌ సాగర్‌లను వెంటబెట్టుకు వచ్చింది. బోడ రాములు, శిల్పలను తల్లిదండ్రులుగా పేర్కొంటూ సాగర్‌కు ఆధార్‌ సంపాదించుకున్నారు. వీరంతా ఖమ్మం శ్రీనివాసనగర్‌కు మకాం మార్చి.. సెంట్రింగ్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

తర్వాత వీరి బంధువైన జమీర్‌ కూడా భారత్‌కు వచ్చాడు. నాలుగో నిందితుడైన మండల్‌ కూడా 11 ఏళ్ల కిందట బెంగళూరుకు వచ్చి, తర్వాత స్నేహితుడి ద్వారా ఖమ్మం శ్రీనివాసనగర్‌కు చేరి సెంట్రింగ్‌ పని చేస్తున్నాడు. ఈ నలుగురు ఇక్కడి మహిళలను వివాహాలు చేసుకున్నారు.

నకిలీ నివాస పత్రాలతో అందరూ ఆధార్‌కార్డులు, ఓటరు కార్డులు పొందారు. సెంట్రింగ్‌ పనులు చేస్తున్న వీరంతా పశ్చిమ బెంగాల్‌ నుండి బాల కార్మికులను ఇక్కడికి తెచ్చి ఖమ్మంలో సెంట్రింగ్‌ పని చేయిస్తుండగా పోలీసులకు వీరి విషయం తెలిసింది.

ఇక్కడి పోలీసులు ఆపరేషన్‌ స్మైల్‌లో భాగంగా… పోలీసులు బాలకార్మికులను గుర్తించి, విచారించడంతో ఈ అక్రమ చొరబాట్లు వెలుగు చూశాయి. నకిలీ ఆధార్‌ కార్డులు, పాస్‌పోర్టులు పొందినట్లు పోలీసులు గుర్తించారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుపై పోలీసులు మరింత దర్యాప్తు చేపట్టారు.

Updated On 5 Feb 2024 2:54 PM IST
cknews1122

cknews1122

Next Story