నువ్వా నా గురించి మాట్లాడేది.. మంత్రి రోజాపై నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల
ck news tirupati
తెలంగాణ ప్రభుత్వం నుంచి తనను డబ్బులు తెమ్మంటున్నారని… తాను డబ్బులు తెస్తే వైసీపీ నేతలు గాడిదలు కాస్తుంటారా అని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) విమర్శించారు.
ఐదేళ్లుగా ముద్దులు పెట్టుకుంటూ బీఆర్ఎస్తో సీఎం జగన్ దోస్తీ చేశారని సెటైర్లు వేశారు. అప్పుడు ఏమైంది మీ దమ్ము….. ఇప్పుడు తనను డబ్బులు తీసుకుని రమ్మని అడుగుతారా సిగ్గులేదా అని దెప్పిపొడిచారు. సొంత చెల్లెలు అని కూడా లేకుండా సోషల్ మీడియా వేదికగా అవమానిస్తారా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
”నేను వైఎస్ బిడ్డను కానని ఒక నిమిషం అనుకుంటాను, దమ్ముంటే రండి.. ఎంత మంది వస్తారో రండి… చూసుకుందాం.. తన మీదా దాడి చేసే దమ్ము మీకుందా” అని సవాల్ విసిరారు. ఎన్నికల వస్తున్నాయని జగన్ అనే కుంభకర్ణుడు నిద్రలేచారని ఎద్దేవా చేశారు. ”సిద్ధం” అంటూ జగన్ సొంత ప్రయోజనాల కోసం ప్రజల దగ్గరకు వస్తున్నారని.. నమ్మకండని చెప్పారు.
తాను తెలంగాణలో పార్టీ పెట్టడం గురించి రోజా మాట్లాడుతుందన్నారు. తన పార్టీనీ కాంగ్రెస్లో విలీనం చేశానని… కాంగ్రెసు బతికి ఉన్నంత కాలం తన పార్టీ ఉంటుందని షర్మిల తెలిపారు. వైఎస్ పాలనకు జగన్ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు.
మంత్రి రోజాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.నగరిలో రోజా దోపిడీ జబర్దస్తీగా చేస్తోందని ఆరోపించారు. నగరిలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారనారు. రోజా, రోజా భర్త, ఇద్దరు అన్నలు అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలేనని ఎద్దేవా చేశారు. రోజా, వారి కుటుంబ కళ్లు పడితే నగరిలో సెంటూ స్థలం ఉండదని ఆరోపించారు.
ఇసుక, గ్రావెల్, మద్యం దందా నుంచి భూ కబ్జాలకు నగరినీ రోజా అడ్డగా చేసుకుందని మండిపడ్డారు. పేదలు చిన్న ఇల్లు కట్టుకుంటే అనుమతులకు కమీషన్ దోచుకుంటున్నారన్నారు. చిన్న ఉద్యోగం ట్రాన్స్ ఫర్ కావాలన్న రోజా కుటుంబానికి కమీషన్ ఇవ్వాల్సిందేనని అన్నారు.
మంత్రిగా ఉండి నగరికి రోజా ఒక్క అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. కరెంటు ఛార్జీల వల్ల నగరిలో చేనేత కార్మికుల వేలకు, వేలు బిల్లులు కట్టాల్సి వస్తోందన్నారు. ఏ రోజైనా నగరి కార్మికుల కోసం కాని పెంచిన, కరెంట్ బిల్లు గురించి అయిన రోజా మాట్లాడారా అని ప్రశ్నించారు. రోజా నోరు ఉందని పారేసుకోవద్దని హెచ్చరించారు.
తన గురించి తెలంగాణలో మాట్లాడిన వాళ్లందరూ ఓడిపోయి ఇంట్లో కూర్చొన్నారని సెటైర్లు వేశారు. రోజా ఎంత డబ్బులు ఇచ్చిన తీసుకోవాలని.. ఎన్నికల్లో ఓటు మాత్రం ఆలోచించి వేయాలని తెలిపారు. వచ్చే రోజుల్లో రోజా ఓటమి ఖాయమని షర్మిల అన్నారు.