కొన్నాళ్ల క్రితం తెలంగాణలో మెడికో ప్రీతి ఆత్మహత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీనియర్ విద్యార్థి ర్యాగింగ్‌ను తట్టుకోలేక మెడికో ప్రీతి..
విషం ఇంజెక్ట్ చేసుకుని.. ఆత్మహత్యాయత్నం చేసింది. అది గమనించి వెంటనే ఆమెని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన అప్పట్లో ఎంతో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో తాజాగా మరో దారుణం వెలుగుచూసింది.
ఆమె కష్టపడి చదివి ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ చదువుతోంది. మరి కొద్ది రోజుల్లో వైద్య విద్య పూర్తి కానుంది. మరి ఏం జరిగిందో తెలియదు.. ఆమెకు ఏం కష్టం వచ్చిందో ఏమో కానీ.. ఆత్మహత్యకు పాల్పడింది ఆమె. ఆ వివరాలు..
బాధితురాలిని మెడికో రచనా రెడ్డి(25)గా గుర్తించారు. అవుట్ రింగ్ రోడ్డులో తన కారులోనే అపస్మారక స్థితిలో ఉన్న రచనా రెడ్డిని రోడ్‌పై వెళుతున్న వాహనదారులు గమనించి అమీనాపూర్ పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు.
విషయం తెలుసుకున్న వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. మెడికో రచనా రెడ్డిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతూ సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు తుది శ్వాస విడిచింది రచనా రెడ్డి. ఇక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం లో నివాసం ఉంటున్న రచనా రెడ్డి.. ఖమ్మం పట్టణంలో ఉన్న మమతా మెడికల్ కాలేజీలో పీజీ కోర్సు చేస్తుంది. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని బాచుపల్లిలో ఉన్న మమతా మెడికల్ కాలేజీలో విధులు నిర్వహిస్తోంది. మరి కొద్ది రోజుల్లో కోర్స్ పూర్తి కానుంది.
మరి ఏం జరిగిందో తెలియదు కానీ సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్ సుల్తాన్‌పూర్ ప్రాంతంలో కారులో విషం ఇంజెక్షన్ చేసుకుంది. ఆ తర్వాత కాసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అటుగా వెళ్తోన్న వారు.. రచనా రెడ్డిని గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే అమీనాపూర్ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న డాక్టర్ రచనా రెడ్డిని వెంటనే మమతా హాస్పిటల్‌కు తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం నాలుగు గంటలకు తుది శ్వాస విడిచింది. రచనా రెడ్డి మృతి వార్త తెలిసి ఆమె చదువుతున్న కాలేజీలో విషాదం అలుముకుంది.
కుమార్తె మరణించింది అని తెలుసుకున్న రచనా రెడ్డి తల్లిదండ్రులు ఆస్పత్రి వద్దకి చేరుకున్నారు. తమ బిడ్డకు ఎలాంటి ఇబ్బందులు లేవని.. ఎందుకు ఇంతటి దారుణ నిర్ణయం తీసుకుందో అర్థం కావడం లేదని వాపోయారు.
మరి కొన్నాళ్లలో వైద్యురాలిగా తమ ముందుకు వస్తుందని ఆశించిన బిడ్డ.. ఇలా ఆస్పత్రిలో విగత జీవిగా మిగిలుతుందని కల్లో కూడా అనుకోలేదంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
సంఘటన జరిగిన సమయంలో కారులో రచనా రెడ్డి ఒక్కత్తే ప్రయాణిస్తుందా.. లేక ఆమెతో పాటు ఇంకా వేరే ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదువు ఒత్తిడి తట్టుకోలేక ఇలాంటి నిర్ణయం తీసుకుందా.. లేదా ఎవరైనా వేధించడం వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకుందా అనే కోణంలో విచారిస్తున్నారు. ఇక కారులో రచనా రెడ్డి డ్రైవర్ సీట్లో, సీటు బెల్ట్ పెట్టుకొని ఉన్నట్లు గమనించారు పోలీసులు.
చేతికి కాన్యులా ఉండటంతో ఆమె తన శరీరంలోకి ఏదైనా విష పదార్ధం ఇంజెక్షన్ చేసుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే దీనిపై ఓ క్లారిటీ వస్తుందన్నారు.