ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి V/S ఎమ్మెల్యే కడియం శ్రీహరి హైదరాబాద్: భారాస నేతలు ప్రతిపక్షంలోకి వచ్చినా వారి బుద్ధి మారలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. శాసనసభ లో ఆయన మాట్లాడారు. బలహీనవర్గానికి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతుంటే కూర్చో అంటూ భారాస ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించారో ఇప్పుడూ అలాగే చేస్తున్నారని.. ఆయనకు ఎంత అహంకారమని ధ్వజమెత్తారు. మంత్రి పదవి విషయంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి …
![రాజగోపాల్‌రెడ్డి V/S కడియం శ్రీహరి రాజగోపాల్‌రెడ్డి V/S కడియం శ్రీహరి](https://cknewstv.in/wp-content/uploads/2024/02/IMG-20240214-WA0047.jpg)
ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి V/S ఎమ్మెల్యే కడియం శ్రీహరి
హైదరాబాద్: భారాస నేతలు ప్రతిపక్షంలోకి వచ్చినా వారి బుద్ధి మారలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. శాసనసభ లో ఆయన మాట్లాడారు.
బలహీనవర్గానికి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతుంటే కూర్చో అంటూ భారాస ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించారో ఇప్పుడూ అలాగే చేస్తున్నారని.. ఆయనకు ఎంత అహంకారమని ధ్వజమెత్తారు.
మంత్రి పదవి విషయంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపైనా రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. దానిపై సీఎం, తమ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ‘‘ఉద్యమకారుడు తాడికొండ రాజయ్యను కడియం శ్రీహరి రెండుసార్లు మోసం చేశారు. ఉపముఖ్యమంత్రి పదవిలో ఉండగా అవమానకర రీతిలో తొలగించేలా చేసి ఆ పదవిలోకి వెళ్లారు. ఏనాడూ తెలంగాణ కోసం కడియం మాట్లాడలేదు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యను తప్పించి టికెట్ తెచ్చుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచినా ప్రభుత్వం రాకపోయేసరికి ఆయన అసహనంతో మాట్లాడుతున్నారు. నేను మంత్రినవుతానో.. లేదో.. తెలియదు. భారాసలో ఉండగా మీరు మాత్రం ఈ జన్మలో మంత్రి కాలేరు’’ అని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి: కేటీఆర్
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ సీనియర్ దళిత నాయకుడైన కడియం శ్రీహరి పట్ల రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వాటిని రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు.
సభలో 119 మంది సభ్యులకూ ఒకే రకమైన హక్కు ఉంటుందన్నారు. అధికార పార్టీ సభ్యులు ఎప్పుడు మాట్లాడేందుకు అడిగినా మైక్ ఇస్తున్నారని.. తమకు మాత్రం ఇవ్వడం లేదని ఆరోపించారు. అందరినీ ఒకేలా చూడాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడారని కేటీఆర్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని గౌరవెల్లి, మలక్‌పేట రిజర్వాయర్లు పూర్తయిన విషయం వాస్తవం కాదా?అని ప్రశ్నించారు. మంత్రిని అగౌరవపరిచే కుసంస్కారం తమకు లేదన్నారు. ‘‘మేడిగడ్డకు వెళ్లి వచ్చి మాపై బురద జల్లుతున్నారు.
ఏప్రిల్‌లో ఎర్రటి ఎండల్లోనూ మిడ్‌మానేరు, అప్పర్ మానేరు నిండుతున్న మాట వాస్తవం కాదా? స్థిరీకరించబడిన సింగూరు, నిజాంసాగర్, ఎస్సారెస్పీ పునరుజ్జీవనం కాళేశ్వరం ద్వారానే సాధ్యమయ్యాయి. ఇంతపెద్ద ప్రాజెక్టులో మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు ఉన్నాయి. ఒక్క బ్యారేజీలో మూడు, నాలుగు పిల్లర్లకు ఇబ్బంది జరిగితే రిపేరు చేయండి’’ అని అన్నారు.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)