గుండు చేసి, మీసాలు తొలగించి.. మెడికల్ స్టూడెంట్లపై సీనియర్ల శాడిజం
దో మెడికల్ కాలేజీ.. సమాజాన్ని రోగాల నుంచి కాపాడే ఎందరో డాక్టర్లు తయారు అవుతారక్కడ. కానీ అక్కడ ర్యాగింగ్ భూతం జడలు విప్పింది. సోదరుల్లాంటి తమ జూనియర్లపై సీనియర్లు శాడిజం చూపించారు.
హాస్టల్ గదుల్లోకి చొరబడి పలువురు విద్యార్థులకు గుండు గీశారు. మీసాలు తొలగించారు. ఈ ఘటన రామగుండం మెడికల్ కాలేజీలో చోటు చేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో మెడికల్ కాలేజీలో పలువురు సీనియర్ మెడికల్ స్టూడెంట్లు ఇద్దరు జూనియర్లపై ర్యాగింగ్ కు పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం రాత్రి జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతూ, అనుబంధంగా ఉన్న హాస్టల్ లో ఉంటున్న ఇద్దరు స్టూడెంట్లపై గదుల్లోకి సీనియర్లు మూకుమ్మడిగా చొరబడ్డారు.
అనంతరం తల వెంట్రకలు ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నిస్తూ.. ట్రిమ్మర్ గుండు చేశారు. అలాగే మీసాలు కూడా తొలగించారు. మరో ముగ్గురు స్టూడెంట్లపై కూడా ర్యాగింగ్ కు పాల్పడ్డారు. ఈ విషయాన్ని బాధితులు తమ తల్లిదండ్రులకు చేరవేశారు. సీనియర్ల చేస్తున్న ర్యాగింగ్ ను భరించలేక ఇద్దరు జూనియర్లు తమ ఇంటికి వెళ్లిపోయారు.
సీనియర్ల ఆగడాలు మితిమీరిపోవడంతో జూనియర్లు మంగళవారం ఆందోళన చేపట్టారు. కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ చాంబర్ ఎదుట నిరసన తెలియజేశారు. ర్యాగింగ్ చేసిన స్టూడెంట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు సీనియర్లు అంటే ఎంతో గౌరవమని చెప్పారు. వారిని ఎప్పుడూ సార్, మేడం అని పిలుస్తూనే ఉంటామని, అయినా ఇంతలా ర్యాగింగ్ చేయడం సరైందని కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయం తెలియడంతో గోదావరిఖని పోలీసులు కాలేజీకి వెళ్లారు. ర్యాగింగ్ ఘటనపై విచారణ జరిపారు. అయితే దీనిపై స్టూడెంట్లు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కానీ ర్యాగింగ్ కు పాల్పడిన సీనియర్లపై చర్యలు తీసుకోవాలని బాధితులు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ హిమబిందుకు ఫిర్యాదు అందించారు.