గురుకుల పాఠశాల మరో విద్యార్థిని ఆత్మహత్య
వరుస ఘటనలతో ఆందోళనలో విద్యార్థులు
సూర్యాపేట మండలం ఇమాంపేట వద్ద గల ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల లో మరో విద్యార్థిని శనివారం ఆత్మహత్య చేసుకోవడం సంచలనం కలిగించింది. ఇటీవలనే అదే గురుకుల కళాశాలకు చెందిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం బైపిసి చదువుతున్న విద్యార్థిని డి వైష్ణవి కళాశాలలో ఫేర్వెల్ పార్టీ జరిగిన సాయంత్రమే ఉరివేసుకొని మరణించింది ఈ విషయమై మృతురాలి బంధువులు విద్యార్థి సంఘాలు ప్రజాసంఘాలు రాస్తారోకో ధర్నాలు చేయడంతో దిగివచ్చిన ప్రభుత్వ అధికారులు గురుకుల కళాశాల ప్రిన్సిపల్ శుక్రవారం సస్పెండ్ చేశారు.
ఆ సంఘటన మరువకముందే తాజాగా అదే గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న సూర్యాపేట జిల్లా మోతే మండలం బురకచర్ల గ్రామ పరిధి కి చెందిన ఇరుగు ఆనంద్ జ్యోతిల కుమార్తె ఇరుగు అస్మిత ( 15) శనివారం ఉరివేసుకొని మరణించింది. ఈ నెల 10న ఇంటర్ విద్యార్థిని వైష్ణవి మృతి చెందడంతో విద్యార్థులు భయపడకుండా ఉంటానికి పాఠశాల కళాశాలకు నాలుగు రోజులు (హోం సిక్ ) సెలవులు ప్రకటించారు.
దీంతో అస్మిత సెలవులలో హైదరాబాద్ కు వెళ్ళింది. శనివారంతో సెలవులు అయిపోతునందున పాఠశాలకు వెళ్దామని చెప్పిన అస్మిత తల్లి తన పనులకు వెళ్లి తిరిగి వచ్చేసరికి అస్మిత ఇంట్లోనే ఫ్యాన్ కు సున్నితో ఉరివేసుకుంది. పాఠశాలకు వెళ్లాల్సిన రోజే అస్మిత ఉరివేసుకోవడం మిస్టరీగా మారింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.