కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రమాదానికి గురయ్యారు. సోమవారం తెల్లవారుజామున ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది.
దీంతో కారులో వున్న ఎమ్మెల్యేతో పాటు మరికొందరికి గాయాలయ్యాయి. అయితే గాయపడ్డ ఎవరికీ ఎలాంటి ప్రాణహాని లేదని … అందరూ స్వల్ప గాయాలపాలైనట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే… ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ నిన్న(ఆదివారం) హైదరాబాద్ లో పనులు ముగించుకుని అర్ధరాత్రి సొంత నియోజకవర్గానికి బయలుదేరారు. ఆయనతో పాటు మరికొందరు కూడా కారులో వున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కారు జగిత్యాల జిల్లాలో ప్రయాణిస్తుండగా ఊహించని ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతూ ఓ లారీని తప్పించబోయిన కారు ఒక్కసారిగా బోల్తా పడింది. అర్ధరాత్రి 3.15 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఎమ్మెల్యే కారు ప్రమాదం జరిగింది. కారు మంచి వేగంతో వుండటంతో అమాంతం ఎగిరి రోడ్డుపక్కన బోల్తాపడింది. కారులోని ఎయిర్ బ్యాగ్ వెంటనే తెరుచుకోవడంతో ఎమ్మెల్యే లక్ష్మణ్ తో పాటు మిగతావారికి ప్రాణాపాయం తప్పింది. లక్ష్మణ్ తలకు గాయంకాగా వెంటనే కరీంనగర్ అపోలో హాస్పిటల్ కు తరలించారు. ఎమ్మెల్యేకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే లక్ష్మణ్ పరిస్థితి మెరుగ్గానే వుందని… చిన్నచిన్న గాయాలకు చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందినవెంటనే పలువురు అధికారులు, పోలీసులు, ఎమ్మెల్యే అనుచరులు, కాంగ్రెస్ నాయకులు హాస్పిటల్ కు చేరుకున్నారు. లక్ష్మణ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరాతీసారు. తమ ఎమ్మెల్యేకు ఎలాంటి ప్రమాదంలేదని తెలుసుకుని ధర్మపురి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.