గంట్లవెల్లిలొ గమ్మత్తు..!
సర్కారీ భూమిలో “రియల్ వెంచర్’
రూ.14 కొట్ల విలువైన భూమి “హాంఫట్”
గంట్లవెల్లిలో ఆలస్యంగా వెలుగు చూసిన “సర్కారీ భూమి” వైనం
సర్కారీ భూమిలో “బిల్డింగ్ బ్లాక్స్ మాయ”
పథకం ప్రకారం రికార్డుల మార్పు..
“పట్టా కెక్కిన ప్రభుత్వ భూమి”
ఔను సర్కారీ భూమి పట్టాగా మారింది… కాదు కాదు పథకం ప్రకారం పట్టాగా మార్చేశారు. అధికారుల చేతివాటం, స్ధానిక నాయకుల ఆర్థిక చెలగాటం కారణంగా ప్రభుత్వ భూమి కాస్త ‘పట్టాభూమి’గా మారడంతో ఏకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లు చేసి అమ్ముకున్న వైనమిది.
గైరాన్ సర్కారీ భూమిలో బతుకు దెరువు కోసం కాస్తు దారులుగా ఉంటూ కాల క్రమేణా సదరు భూమిని అధికారుల ప్రమేయంతో పట్టాగా మార్చుకుని భూ పందేరానికి తెరలేపారు.
రికార్డులు పుట్టుక పూర్వోత్తరాలు మొత్తం సర్కారీ గైరాన్ భూమిగా నమోదై ఉంది.. కానీ కాలక్రమమైనా సర్కారీ పదాన్ని పక్కకు నెట్టేసి పట్టా భూమి మీద రికార్డుకెక్కించారు.
అసలేం జరిగింది…? రంగారెడ్ది జిల్లా ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని గంట్లవెల్లి గ్రామంలో సర్వే నెంబరు 2లో 7-20 గుంటల గైరాన్ సర్కారీ భూమి ఉంది. రెవెన్యూ రికార్డులు 1954-1955 ఖాస్త్రా, 1955-1958 సెస్సాలా ప్రకారం రెవెన్యూ రికార్డులో ఈ సర్వే నెంబర్ పూర్తిగా “గైరాన్ సర్కారీ” గా నమోదై ఉంది.
అయితే రెవెన్యూ రికార్డు 1961-62 పహనీ ప్రకారం గైరాన్ సర్కార్ భూమిలో సాగుదారుడిగా పి. భీష్మ అనే వ్యక్తి పేరు నమోదై ఉంది. ఇక అదే రికార్డు 1962 – 63 పహనీ లో సర్కారీ గైరాన్ భూమిగా చూపుతూ లావోని పట్టా ఆక్షేపణ అంటూ కాస్తూ దారుడిగా సదరు పి. భీశ్మ ను రికార్డులో నమోదు చేశారు. ఇక్కడి నుండే అసలు కథ ప్రారంభమయ్యింది.
1964 -1965 పహనీలో సర్వే నెంబరు 2 కింద భూమి స్వబావాన్ని ఇంతకాలం సర్కారీ, గైరాయిన్ గా చూపిన అధికారులు కొత్తగా పట్టా – సర్కారీగా చూపడం మొదలెట్టారు. ఇంకేముంది కాల క్రమేణా 1971- 72 పహనీలలో ఏకంగా సదరు భూమిని పూర్తిగా పట్టా భూమిగా మార్చేసి నమోదు చేశారు.
పాత ఆర్ఓఆర్ రికార్డు మాయం ఫరూఖ్ నగర్ మండలం గంట్లవెల్లి గ్రామానికి చెందిన సర్వేనెంబర్ 2 భూములకు సంబంధించి 1979- 80 ఓల్డ్ ఆర్ఓఆర్ రికార్డుకూడా తహశీల్దార్ కార్యాలయంలో అందుబాటులో లేదు. సదరు రికార్డు చినిగిపోయిందంటూ సిబ్బంది తాపీగా చెబుతున్నారు. విశ్వసినీ సమాచారం ప్రకారం ఈ రికార్డును గల్లంతు చేసినట్టు విశ్వసనీయ సమాచారం.
ప్లాట్లుగా మారిన ప్రభుత్వ భూమి అధికారుల చేతివాటం కారణంగా గైరాన్ సర్కారీ భూమికి పట్టాగా రికార్డులో నమోదు కావడంతో గంట్లవెళ్లి 2 సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమి స్థానంలో పట్టాదారుగా వస్తున్న వారు మరణించడంతో వారి వారసులు సదరు భూమిని విరాసత్ చేసుకున్నారు.
రెవెన్యూ రికార్డుల్లో పూర్తిగా పట్టా భూమిగా నమోదు అయి వస్తుండటంతో ఆ భూమిపై కన్నేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల తెలివిగా భూములు కొనుగోలు చేసి ఏకంగా ప్లాట్లు చేసి సొమ్ము చేసుకున్నారు.
ఈ భూమి ఎలా అమ్మారు ? ఎలా నాలా కన్వర్షన్ అయింది. దీని వెనక ఎవరెవరున్నారు..? అసలు “బిల్డింగ్ బ్లాక్స్” చేసిన మాయ ఏమిటి? కోహినూర్ తాజ్ హైట్స్ కు సంబంధం ఏంటి వివరాలు రేపటి కథనంలో..?!