ఐటీ ఉద్యోగాల కంటే వ్యవసాయ రంగమే సంతృప్తి
గిట్టుబాటు ధర కోసం కోల్డ్ స్టోరేజీల నిర్మాణాలు రైతులకు మేలు
భద్రాద్రి కోల్డ్ స్టోరేజ్ ను ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఫిబ్రవరి 22 తల్లాడ సీకే న్యూస్ ప్రతినిధి విజయ్
ప్రపంచంలోనే అన్ని ఉద్యోగాల కంటే వ్యవసాయ ఉద్యోగమే ఎంతో సంతృప్తిని ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఖమ్మంజిల్లా తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన భద్రాద్రి కోల్డ్ స్టోరేజ్ ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్ని ఉద్యోగాలు ఉన్నప్పటికీ వ్యవసాయం చేసే ఉద్యోగమే మనశ్శాంతిని ఇస్తుందన్నారు. అమెరికాలో ఐటీ ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా స్వగ్రామాలకు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారని ఈ సందర్భంగా వ్యవసాయ ప్రాముఖ్యతను వివరించారు. అక్కడ పది లక్షలు వచ్చినా ఇక్కడ రెండు లక్షలు వచ్చిన సంతృప్తిగా ఉంటుందన్నారు.
దేశానికి వెన్నెముక రైతేనని పునరుద్ఘాటించాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే దిశగా పనిచేస్తుందని గుర్తు చేశారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం కోల్డ్ స్టోరేజీలు ఎంతో మేలన్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు.
తన చిరకాల వాంఛ అయిన సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లా రైతంగంతో పాటు వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల రైతుల పంటలను కాపాడుతానన్నారు. వరి, మిర్చితోపాటు ఈ రెండు నియోజకవర్గాల్లో పామాయిల్ సాగును కూడా విస్తరింప చేయాలని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం కోల్డ్ స్టోరేజ్ ను నిర్మించిన నిర్వాహకులు చావా శ్రీనివాసరావును రైతుల పక్షాన మంత్రి అభినందించారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు మట్టా రాగమయి దయానంద్, మాలోతు రాందాసు నాయక్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువాళ్ల దుర్గాప్రసాద్, మాజీ సర్పంచ్ మారెళ్ళ మమత, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.