MuluguPoliticalTelangana

ఎన్నిక‌ల్లో ఇచ్చిన ప్ర‌తిహామీని ప్ర‌తిహామీని అమ‌లు చేస్తాం…

ఎన్నిక‌ల్లో ఇచ్చిన ప్ర‌తిహామీని ప్ర‌తిహామీని అమ‌లు చేస్తాం...

27వ తేదీన రెండు హామీల అమ‌లు ప్రారంభం…

రూ.2 ల‌క్ష‌ల రుణ‌మాఫీపై త్వ‌ర‌లోనే రైతుల‌కు శుభ‌వార్త‌

స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ‌ ఆశీర్వాదంతోనే తెలంగాణలో ఇందిర‌మ్మ రాజ్యం

సికె న్యూస్ ప్రతినిధి మేడారం

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి
మేడారం: ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా రూ.500కే గ్యాస్ సిలెండ‌ర్, తెల్ల‌రేష‌న్ కార్డు ఉన్న ప్ర‌తి పేద‌వానికి 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని ఈ నెల 27వ తేదీన ప్రారంభించ‌నున్న‌ట్లు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కార్య‌క్ర‌మానికి ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజ‌రవుతార‌ని ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు.

రాష్ట్రంలో ఉన్న చిక్కుముడులు విప్పుతూ, ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తున్నామ‌ని, ఇప్ప‌టికే మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, రాజీవ్ ఆరోగ్య ప‌రిమితిని రూ.5 ల‌క్ష‌ల నుంచి రూ.10 ల‌క్ష‌ల‌కు పెంచామ‌న్నారు. మేడారం మ‌హా జాత‌ర సంద‌ర్బంగా శ్రీ స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి నిలువెత్తు బంగారం (బెల్లం), ప‌సుపు, కుంకుమ‌,గాజులు స‌మ‌ర్పించి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

అనంత‌రం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విలేక‌రుల‌తో మాట్లాడారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన ప్ర‌తిహామీని అమ‌లు చేస్తామ‌న్నారు. రైతుల‌కు ఇచ్చిన రూ.2ల‌క్ష‌ల రుణ‌మాఫీనిపై బ్యాంకుల‌తో చ‌ర్చిస్తున్నామ‌ని, త్వ‌ర‌లోనే రైతుల‌కు మంచి శుభ‌వార్త చెప్ప‌బోతున్నామ‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. ఇప్ప‌టికే మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సుప్ర‌యాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ ప‌రిమితిని రూ.5 ల‌క్షల నుంచి రూ.ప‌ది ల‌క్ష‌ల‌కు పెంచామ‌ని గుర్తు చేశారు.

ఎన్నిక‌ల ముందు ఇచ్చిన ప్ర‌తిహామీని అమ‌లు చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి పున‌రుద్ఘాటించారు. అధికారంలోకి వ‌చ్చిన 60 రోజుల్లోనే 25 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేశామ‌ని, 6,956 మంది స్టాఫ్ న‌ర్సుల నియామ‌కం, 441 సింగ‌రేణి ఉద్యోగులు, 15 వేల పోలీసు, ఫైర్ డిపార్టుమెంట్ ఉద్యోగాలు భ‌ర్తీ చేశామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. మార్చి 2వ తేదీన మ‌రో 6 వేలపైచిలుకు ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌బోతున్నామ‌న్నారు.

రెండు ల‌క్ష‌ల ఖాళీలు భ‌ర్తీ చేస్తామ‌ని చెప్పామో…దానికి త‌గిన‌ట్లు 25 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేశామ‌ని, వాటిని ప్ర‌జ‌ల‌కు క‌నిపించేలా.. కుళ్లుకుంటున్న వారికి వినిపించేలా ఎల్‌బీ స్టేడియంలో నే వేలాది మంది స‌మ‌క్షంలో వారికి నియామ‌క ప‌త్రాలు ఇచ్చామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు.

ఉద్యోగాలు ఇచ్చినా ఇవ్వ‌లేదంటూ మామాఅల్లుళ్లు,తండ్రీకొడుక‌లు త‌మ ప్ర‌భుత్వంపై గోబెల్స్‌లా అబ‌ద్ధ‌పు, త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో యువ‌కుల‌కు ఉద్యోగాలు క‌ల్పించేందుకు ప‌ది స్కిల్ యూనివ‌ర్సిటీలు ఏర్పాటు చేసేందుకు ప్ర‌ణాళిక రూపొందిస్తున్న‌ట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

త్వ‌ర‌లోనే ప్రెస్ అకాడ‌మీ ఛైర్మ‌న్‌ను నియ‌మిస్తాం…
త్వ‌ర‌లోనే ప్రెస్ అకాడ‌మీ ఛైర్మ‌న్‌ను నియ‌మిస్తామ‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తాము అధికారంలోకి వ‌చ్చి వంద రోజులు కాలేద‌ని, జ‌ర్న‌లిస్టులు ప‌దేళ్లు ఓపిక ప‌ట్టార‌ని, త్వ‌ర‌లోనే వారి అన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తామ‌న్నారు. ప్ర‌భుత్వాన్ని తేవ‌డంతోనే జ‌ర్న‌లిస్టుల ప‌ని అయిపోలేద‌ని కుట్ర‌లు, కుతంత్రాలను తిప్పికొట్ట‌డానికి స‌హ‌క‌రించాల‌ని ముఖ్య‌మంత్రి కోరారు.

వాళ్లు ఇద్ద‌రి (బీజేపీ-బీఆర్ఎస్‌ను ఉద్దేశించి) స‌మ‌న్వ‌యం మీకు తెలుస‌ని, ఉద‌యం, సాయంత్రం మాట్లాడుకుంటున్నార‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. ప‌ది సీట్లు బీజేపీకి, ఏడు సీట్లు కేసీఆర్‌కు మాట్లాడుకొని ఎన్నిక‌ల‌కు రాబోతున్నార‌ని, ఆ చీక‌టి ఒప్పందాన్ని మీడియా మిత్రులు తిప్పికొట్టాల‌ని ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ‌ల స్ఫూర్తితో….
స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ ఆశీర్వాదంతోనే తెలంగాణ రాష్ట్రంలో ఇందిర‌మ్మ రాజ్యం, కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డింద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మంచి వ‌ర్షాలు ప‌డి పాడిపంట‌ల‌తో ప్ర‌జ‌లు విల‌సిల్లాల‌ని, తెలంగాణ‌లోని నాలుగు కోట్ల ప్ర‌జ‌లు సుఖ‌శాంతుల‌తో వ‌ర్ధిల్లాల‌ని స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ‌ను వేడుకున్న‌ట్లు ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

ఈ ప్రాంతంతో, ఈ ప్రాంత శాస‌న‌స‌భ్యురాలు, మంత్రి సీత‌క్క‌తో త‌న‌కున్న‌ వ్య‌క్తిగ‌త అనుబంధం.. రాజ‌కీయంగా తామిద్ద‌రం క‌లిసి చేసిన ప్ర‌యాణం అంద‌రికీ తెలుస‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. తాము ఏ ముఖ్య కార్య‌క్ర‌మం తీసుకున్నాఇక్క‌డ స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ ఆశీస్సులు తీసుకొనే మొద‌లుపెట్టామ‌న్నారు. 2023, ఫిబ్రవ‌రి ఆరో తేదీన హాత్ సే హాత్ జోడోను ఇక్క‌డ నుంచే ప్రారంభించామ‌ని ముఖ్య‌మంత్రి గుర్తు చేశారు. ప్ర‌జా తీర్పు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటుంది..

కాంగ్రెస్ ప్ర‌భుత్వం, ప్ర‌జా ప్ర‌భుత్వ ఏర్ప‌డుతుంద‌ని తాము ఆనాడే చెప్పామ‌న్నారు. రాబోయే స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ జాతర‌ను భ‌క్తుల‌కు అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా, అన్నిర‌కాల ఏర్పాట్ల‌ను స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించి చేస్తామ‌ని ఆనాడే చెప్పామ‌ని, అలానే చేశామ‌న్నారు. అమ్మ‌ల ఆశీస్సుల‌తో సీత‌క్క‌, కొండా సురేఖ మంత్రుల‌య్యార‌ని, త‌మంద‌రికీ వివిధ హోదాలు, బాధ్య‌త‌లు వ‌చ్చాయ‌నన్నారు.

ఆ బాధ్య‌త‌తోనే సుమారు ఒక కోటి యాభై ల‌క్ష‌ల మంది భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గొద్ద‌ని, ఏర్పాట్ల‌లో లోపం ఉండ‌ద‌నే ఉద్దేశంతో త‌మ ప్ర‌భుత్వం రూ.110 కోట్ల‌ను జాత‌ర‌కు కేటాయించింద‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. ఎన్నిక‌లు పూర్తికాగానే జాత‌రపై దృష్టి పెట్టాల్సి రావ‌డంతో మంత్రులు సీత‌క్క‌, కొండా సురేఖ‌, పొన్నం ప్ర‌భాక‌ర్, పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డిలను బృందంగా ఏర్పాటు చేసి స‌మ‌న్వ‌యంతో ప‌నులు చేయించిన‌ట్లు చెప్పారు.

ఆడ బిడ్డ‌లకు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం క‌ల్పించ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వ తొలి నిర్ణ‌య‌మ‌ని, జాత‌ర‌కు ఆడ బిడ్డ‌లు పెద్ద ఎత్తున వ‌స్తున్న నేప‌థ్యంలో ఆరు వేల ఆర్టీసీ బ‌స్సుల‌తో ర‌వాణా సౌక‌ర్యం ఏర్పాటు చేశామ‌ని, అన్ని డిపోల నుంచి బ‌స్సుల‌ను ఇక్క‌డి పంపాల‌ని ఆదేశించ‌డంతో పాటు అద‌నంగా వంద కొత్త బ‌స్సులు కొనుగోలు చేసి జాత‌ర‌కు వాటిని వినియోగించామ‌ని ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు.

రాష్ట్రంలో 18 కోట్ల మంది ఆడ బిడ్డ‌లు ఉచిత బ‌స్సులు వినియోగించుకున్నార‌ని, జాత‌ర‌కు ల‌క్ష‌లాది మంది మ‌హిళ‌లు వ‌చ్చేందుకు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం ఉప‌యోగప‌డింద‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ అంటేనే పోరాట స్ఫూర్తి అని, ప్ర‌జ‌ల‌పై ఆధిప‌త్యం చ‌లాయించాల‌నుకున్న‌, ప్ర‌జ‌లను పీడించైనా ప‌న్నులు వ‌సూలు చేయాల‌నుకున్న రాజులను పేద‌లు, ఆదివాసీ బిడ్డ‌లైన త‌ల్లీబిడ్డ‌లు, తండ్రీ కొడుకులు అంతా క‌లిసిక‌ట్టుగా పోరాడార‌ని ఆయ‌న కొనియాడారు.

బ‌డుగుల‌, ఆదివాసీల ప‌క్షాన కొట్లాడి నేల‌కు ఒరిగినందునే వంద‌ల సంవ‌త్స‌రాలైనా స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ‌ను దేవుళ్లుగా కొలుస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. త‌మ‌ను న‌మ్ముకున్న ప్ర‌జ‌ల కోసం నిల‌బడి పాల‌కుల‌తో కొట్లాడినందుకు అమ‌రులై వారు దేవ‌తలుగా వెలిశార‌ని ముఖ్య‌మంత్రి శ్లాఘించారు.

ఆనాటి నుంచి ఈనాటి వ‌ర‌కు పాల‌కుడు ప్ర‌జ‌ల‌ను వేధించిన‌ప్ప‌డు, పీడించిన‌ప్పుడు, ఆధిప‌త్యం చ‌లాయించాల‌నుకుప్పుడ‌ల్లా ఎవ‌రో ఒక‌రు నిల‌బ‌డ‌తార‌ని, నిల‌బ‌డ్డ‌వాడు, నిటారుగా నిల‌బ‌డి పేద ప్ర‌జ‌ల ప‌క్షాన కొట్లాడిన‌వాడు విజ‌యం సాధిస్తార‌నే స్ఫూర్తిని స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ నుంచి తాము పొందామ‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. ఆ స్ఫూర్తితోనే ప‌దేళ్లుగా పాల‌కులు చేస్తున్న అరాచ‌కాన్ని, దోపిడీని, ప్ర‌జ‌ల‌పై ఆధిప‌త్యం చ‌లాయించాల‌నుకొని తామే రాజులం, శాశ్వ‌తం అనుకున్న వారిపై తిర‌గబ‌డి ప్ర‌జ‌ల త‌ర‌ఫున కొట్లాడామ‌న్నారు.

ఆ రోజు ఎన్నొ ఒడిదొడుకులు ఎదుర్కొని నిల‌బ‌డినందునే ఈ రోజు పేదల ప్ర‌భుత్వం ఏర్ప‌డింద‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ‌ల స్ఫూర్తి ప్ర‌జాస్వామిక దేశంలో తెలంగాణ రాష్ట్రంలో త‌మంద‌రిని ప్ర‌భావితం చేసి పోరాటంలో ముందుకు న‌డిపినందునే ఈరోజు ప్ర‌జా ప్ర‌భుత్వం ఏర్ప‌డింద‌న్నారు.

ప్ర‌జా పాల‌న ద్వారా ప్ర‌జ‌ల‌కు చేరువై ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డానికి త‌మ శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. త‌మ ప్ర‌య‌త్నాల‌తో నూటికి నూరు శాతం స‌మ‌స్య‌లు ప‌రిష్కారమ‌య్యాయ‌ని తాను అన‌న‌ని, కానీ ఈ ప్ర‌భుత్వం మాది, ఈ ప్ర‌భుత్వానికి మా స‌మ‌స్య‌లు చెప్పుకోవ‌చ్చ‌ని, ఈ ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర‌కు మేం వెళ్లొచ్చు, ఈ ప్ర‌భుత్వం త‌మ వ‌ద్ద‌కు వ‌స్తుంద‌ని, మా గ్రామాల్లో మా మాట వింటుంది… మా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తుంది,

తండాలు, గూడేల్లో కూడా ప్ర‌జా పాల‌న ప్ర‌జ‌లకు చేరువ‌వుతంద‌నే ఒక భ‌రోసా, విశ్వాసాన్ని ఈ 75 రోజుల్లో తాము కల్పించే ప్ర‌య‌త్నం చేశామ‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. భ‌విష్య‌త్తులోనూ ఈ స్ఫూర్తిని కొన‌సాగిస్తామ‌ని, త‌మ‌ది ప్ర‌జ‌ల ఎజెండా అని, ప్ర‌జ‌లు ఏం అంశాల‌ను త‌మ దృష్టికి తీసుకువ‌స్తున్నారో వాటినే ప్ర‌జ‌ల ఎజెండాగా మార్చి ప్ర‌భుత్వ విధానాలుగా మార్చి ముందుకు వెళుతున్న‌ట్లు ముఖ్య‌మంత్రి వివ‌రించారు.

ప్ర‌ధాన‌మంత్రి సంద‌ర్శ‌న‌కు రావాలి…
ద‌క్ష‌ణ కుంభ‌మేళాలాంటి ఈ జాత‌ర‌కు కోటిన్న‌ర మంది భ‌క్తులు వ‌స్తున్నా కేంద్ర ప్ర‌భుత్వం దీనిని జాతీయ పండ‌గ‌గా గుర్తించ‌డం లేద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మేడారం జాత‌ర‌ను జాతీయ పండగగా గుర్తించాల‌ని తాము ఎన్ని సార్లు కోరినా అలా కుద‌ర‌ద‌ని కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కిష‌న్ రెడ్డి అంటున్నార‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు.

కేంద్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర భార‌తం, ద‌క్ష‌ణ భార‌తం అనే వివ‌క్ష చూప‌డం స‌రికాద‌ని ముఖ్య‌మంత్రి హిత‌వు ప‌లికారు. ద‌క్ష‌ణ భార‌త‌మ‌నే కాదు ప్ర‌పంచంలోనే స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ జాత‌ర‌కు ఒక గుర్తింపు ఉంద‌ని, వారి వీరోచిత పోరాటానికి చ‌రిత్ర పుట‌ల్లో స్థానం ఉన్నందున కేంద్ర ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చేయొద్ద‌ని, ప్ర‌ధాన‌మంత్రి వ‌చ్చి సంద‌ర్శించుకోవాల‌ని ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

గ‌తేడాది ఫిబ్ర‌వ‌రి ఆరో తేదీన మేం ప్రారంభించిన యాత్ర విజ‌య‌వంత‌మై ఈ రోజు అధికారంలోకి వ‌చ్చి అధికారికంగా జాత‌ర‌ను నిర్వ‌హించామ‌న్నారు. భ‌విష్య‌త్‌లో ఇంకా స‌మ‌యం ఉంటుంది క‌నుక ఈ ప్రాంతంలో భ‌క్తులు ఎలాంటి ఇబ్బందులు జ‌ర‌గ‌కుండా అన్ని ర‌కాల వ‌స‌తులు క‌ల్పిస్తామ‌ని ముఖ్య‌మంత్రి హామీ ఇచ్చారు.

గుళ్ల‌లో సంప‌న్నులు, ఆగ‌ర్భ శ్రీ‌మంతులు గుళ్ల‌కు వెళితే వ‌జ్రాలు, వైఢూర్యాలు ఇచ్చే సంప్ర‌దాయం ఉంద‌ని, కానీ అత్యంత పేద‌లు, నిరుపేద‌లు బాధ‌ప‌డుతుంటే స‌మ్మ‌క్క క‌ల‌లో ప్ర‌త్య‌క్ష‌మై బెల్లం ఇస్తే అదే బంగారంగా భావిస్తామ‌ని చెప్ప‌డంతోనే ఇక్క‌డ బెల్లం బంగార‌మైంద‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. ఇక్క‌డకు రాలేని భ‌క్తుల‌కు ఆన్‌లైన్ ద్వారా బంగారం (బెల్లం) పంపించే ఏర్పాట్ల‌ను దేవాదాయ శాఖ చేసింద‌ని ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు.

కేసీఆర్ కుటుంబ దోపిడీ బీజేపీ ఎందుకు స్పందిచ‌లేదు..
కాళేశ్వ‌రం ప్రాజెక్టులో దోపిడీ, అక్ర‌మాలు, నిర్ల‌క్ష్యం క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపామ‌ని, కేసీఆర్ కళ్లు మూసుకొని ఫాంహౌస్‌లో ఉండ‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి కృష్ణా జ‌లాల‌ల‌ను తర‌లించుకుపోయార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు.

రాష్ట్రాన్ని రూ.ఏడు ల‌క్ష‌ల కోట్ల అప్పుల‌తో కేసీఆర్ దివాళా తీయించార‌ని ముఖ్య‌మంత్రి మండిప‌డ్డారు. కేసీఆర్ ప‌దేళ్లుగా దోపిడీకి పాల్ప‌డుతుంటే పిల్లి క‌ళ్లు మూసుకొని పాలు తాగిన చందంగా ఏనాడూ ప్ర‌ధామ‌నంత్రి న‌రేంద్ర మోదీ అడ్డుకోలేద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మేడిగ‌డ్డ‌పై తాము జ్యుడిషియ‌ల్ విచార‌ణ‌కు అనుమ‌తి ఇచ్చిన త‌ర్వాత దానిని సీబీఐకి అప్ప‌గించాల‌ని బీజేపీ నాయ‌కులు డిమాండ్ చేస్తున్నార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. ప‌దేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయ‌కులు కేసీఆర్‌, కేటీఆర్ ఆ కుటుంబంపై కేసు పెట్టారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

సీబీఐ, ఈడీ, ఐటీ అన్నీ కేంద్రం ద‌గ్గ‌రే ఉన్నాఎందుకు స్పందించ‌లేద‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌శ్నించారు. తాము ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా ఇచ్చిన నివేదిక‌లు ప‌ట్టించుకోలేద‌ని, ఇప్పుడు ఎందుకు సీబీఐ అంటున్నార‌ని ఒక బీజేపీ నేత‌ను ప్ర‌శ్నిస్తే దానిని త‌మ‌కు అప్ప‌గిస్తే మేం కొంచె గిల్లుకోవ‌చ్చు క‌దా అన్నార‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు.

కేసీఆర్ దోపిడీలో వాటా కోస‌మే త‌ప్ప దానిపై చ‌ర్య‌లుతీసుకోవాల‌నే ఆలోచ‌న బీజేపీ నేత‌ల‌కు లేద‌న్నారు. త్వ‌ర‌లోనే రిటైర్డ్ హైకోర్టు,సుప్రీంకోర్టు జ‌డ్జిల ఆధ్వ‌ర్యంలో సాగే విచార‌ణ‌ను బీఆర్ఎస్ నాయ‌క‌లు ఎదుర్కొవాల్సి ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి హెచ్చ‌రించారు.

సామాజిక న్యాయం- పార‌ద‌ర్శక‌త‌
గ‌తంలో ప్ర‌తి పోస్టుకు డ‌బ్బు ఇస్తే త‌ప్ప పోస్టులు వ‌చ్చేవి కావ‌నిముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తాము పార‌ద‌ర్శ‌కంగా, సామాజిక న్యాయం పాటిస్తూ పోస్టింగ్‌లు ఇచ్చామ‌ని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత పోస్టింగుల్లో న్యాయం జ‌రిగిందా లేదా అని ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను అడ‌గాల‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు సూచించారు.

గ‌తంలో నెల చివ‌ర వ‌ర‌కు జీతాలు వ‌చ్చేవి కావ‌ని, మొదటి నెల నాలుగో తేదీన‌, రెండో నెల‌లో మొద‌టి తారీఖు ఇవ్వ‌డంతో ప్ర‌భుత్వ ఉద్యోగులు ఆశ్చ‌ర్య‌పోతున్నార‌ని తెలిపారు. ప్ర‌భుత్వ పాల‌న‌ను గాడిలో పెడుతున్నామ‌ని, తాను, మంత్రులు సెల‌వు తీసుకోకుండా ప‌ని చేస్తున్నామ‌ని, ప్ర‌జ‌లకు మేలు జ‌రిగేలా ప‌ని చేస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు.

తెలంగాణ స‌మాజానికి స్వేచ్ఛ ఇచ్చాం…
స‌చివాలయంలోకి అంద‌రినీ అనుమ‌తిస్తున్నామ‌ని, గ‌తంలో జ‌ర్న‌లిస్టుల‌ను స‌చివాల‌యంలోకి రానివ్వ‌లేద‌ని, ఇప్పుడు ప్ర‌తి ఛాంబ‌ర్‌కు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

స‌చివాల‌యానికి వెళ్లాల‌నుకున్న త‌న‌ను, సీత‌క్క‌ను గ‌తంలో వెళ్ల‌నివ్వ‌లేద‌ని ఆయ‌న గుర్తు చేశారు. అంతా స‌చివాల‌యానికి వెళ్లే స్వేచ్ఛ ఉంద‌ని, తెలంగాణ ప్ర‌భుత్వానికి కాంగ్రెస్ ప్ర‌భుత్వం స్వేచ్ఛ ఇచ్చింద‌ని ముఖ్యమంత్రి అన్నారు.

సంక్షేమం, అభివృద్ధి నిరంత‌రం చేస్తామ‌న్నారు. జాత‌ర వ‌చ్చిన‌ప్పుడే కాకుండా నిరంత‌రం మంత్రులు సీత‌క్క‌, కొండా సురేఖ‌ల స‌హాయంతో ఈ ప్రాంత అభివృద్ధిని తానుస్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తాన‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Hey there! We keep this news portal free for you by displaying ads. However, it seems like your ad blocker is currently active. Please consider disabling it to support us in keeping this platform running and providing you with valuable content. Thank you for your support!