పట్టా మార్పిడిపై హైకోర్టు సీరియస్
జిల్లా కలెక్టర్ సహా రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులకు షోకాజులు
ఇకపై ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయకూడదని ఆదేశాలు
ఒకరి భూమిని మరొకరికి పట్టా చేసిన రెవెన్యూ అధికారులు
ప్రభుత్వ పథకాలన్నిటికి దూరమైన బాధిత రైతు
(సి కె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం) రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదంతో ఒక రైతన్న నానా కష్టాలు పడుతున్నాడు. తనకు చెందిన భూమి వేరొకరి పేరున పట్టా అవడమే కాకుండా రైతు బందు పిఎం కిసాన్ వంటి ప్రభుత్వ పథకాలు కూడా అతనికి రాకపోవడానికి కారణమైన రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ అధికారులు రైతు ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదు.
తన భూమికి పట్టా ఇవ్వాలంటూ ఐదారేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎలాంటి ఫలితం లేకపోవడంతో విసుగు చెందిన ఆ రైతు చివరికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో మొర పెట్టుకున్నాడు. కేసు వివరాలు పరిశీలించిన హై కోర్టు సంబధిత అధికారులందరికి షోకాజు నోటీసులు జారీ చేసింది. అధికారుల నుండి వివరణతో పాటు అతని భూమికి సంభందించి ఇకపై ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయకూడదని ఆదేశించింది. బాధితుడు పడిగ పుల్లయ్య తరఫున హైకోర్టు అడ్వకేట్ బి.శిరీష తన వాదనలు వినిపించింది.
ఒకే రెవెన్యూ గ్రామంలో ఒక రైతుకే రెండు పాసు పుస్తకాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కొప్పురాయి రెవెన్యూ గ్రామ పరిధిలో పడిగ పుల్లయ్య అనే రైతుకు సర్వే నంబరు 161/26 లో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రెవెన్యూ రికార్డులలో కూడా ఇప్పటికీ ఆయన పేరు నమోదు కాబడి ఉంది. కానీ పట్టా మాత్రం చింత పుల్లయ్య అనే పక్క గ్రామానికి చెందిన వ్యక్తి పేరుతో వచ్చింది. అదే రైతుకు డిటో రెవెన్యూ గ్రామంలోనే మరొక తెలంగాణ పట్టాదారు పాసుపుస్తకం కూడా ఇచ్చారు రెవెన్యూ అధికారులు.
అయితే ఒక పట్టాదారు పాసు పుస్తకంలో బాధిత రైతు తండ్రి పేరైన పడిగ వెంకయ్య అని ఉండగా మరికదానిలో మాత్రం చింత నాగయ్య అని ఇచ్చారు. ఈ విధంగా ఒకే రెవెన్యూ గ్రామాలు ఒక రైతుకు రెండు వేరు వేరు పేర్లతో వేరు వేరు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేసి హౌరా అనిపించారు రెవెన్యూ శాఖ వారు. వాస్తవంగా ఒక రెవెన్యూ గ్రామంలో రైతుకు ఉన్న అన్ని సర్వే నంబర్లకు కలిపి ఒకే ఖాతా నంబరు అంటే పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వడం జరుగుతుంది.
తన తండ్రి పేరు మార్చి తన భూమిని వెరోకరికరికి పట్టా ఇచ్చారని సదరు బాధిత రైతు ఎన్ని సార్లు టేకులపల్లి మండల రెవెన్యూ కార్యాయలం చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోలేదు. ఒకే రెవెన్యూ గ్రామంలో ఒకే రైతుకు రెండు వేరు వేరు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు అయ్యాయని తెలిసినా కూడా రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటే వారి నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఆధార్ మిస్ మ్యాచ్ అయినా కనిపెట్టని రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు.
టేకులపల్లి మండల తహశీల్దార్ కార్యాలయం వారు ఒక పట్టాదారు పాసు పుస్తకంలో బాధిత రైతు తండ్రి పేరైన పడిగ వెంకయ్య అని మరోక దానిలో చింత నాగయ్య అని ఇచ్చారు. ఒకే రెవెన్యూ గ్రామంలో ఒకే రైతుకు తండ్రి పేర్లు మార్చి వేరు వేరు పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేసి రెండు పాసు పుస్తకాలలో చింత పుల్లయ్య ఆధార్ కార్డు నంబరే ఇచ్చారు.
రెవెన్యూ రికార్డుల ప్రకారం చూసినా క్షేత్ర స్థాయి పరిశీలనకు వచ్చినా పట్టాదారు గా పడిగ పుల్లయ్య పేరు ఉంటుంది. ధరణిలో రైతు వివరాలు నమోదు చేసేటప్పుడే ఆధార్ మిస్ మ్యాచ్ అవ్వాలి. కానీ తండ్రి పేర్లు మారినా అధికారులు ఎందుకు గుర్తించ లేకపోయారు అన్నది ప్రశ్న. అంతే కాదు ఈ తప్పును రెవెన్యూ అధికారులు మాత్రమే కాకుండా వ్యవసాయ శాఖ అధికారులు కూడా తేలికగా గుర్తించవచ్చు.
రైతు బంధు పథకం కింద రైతు వివరాలు నమోదు చేసేటప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు పట్టాదారు పాసుపుస్తకాలలో ఒకే ఆధార్ నంబరుపై పట్టా పుస్తకం వివరాలు వేరు వేరు తండ్రి పేర్లతో కనబడినప్పుడు దానిని వెంటనే తేలికగా గుర్తించవచ్చు. అంతెందుకు రెండు పాసు పుస్తకాలపై రైతుబందు లావాదేవీలు జరుగుతున్నప్పుడు బ్యాంకు అధికారులు సైతం ఈ తప్పును తేలికగానే కనిపెట్టవచ్చు. కానీ రైతు తమ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా జరిగిన తప్పు తమ దృష్టికి వచ్చినా ఏ అధికారి పట్టించుకోలేదు.
బాధిత రైతు తన భూమిపై వేరొక వ్యక్తి ఎన్నేళ్లుగా రైతు బంధు పొందుతున్నది తెలుకోడం కోసం సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు పెట్టినప్పుడు సమాచారం ఇచ్చారు తప్ప వ్యవసాయ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ప్రజావాణి పట్టించుకోకున్నా హై కోర్టు ఆలకించింది
తనకు మంజూరు కావాల్సిన పట్టాదారు పాసుపుస్తకం పేరు మార్పిడికి గురై వేరొక రైతుకు ఇచ్చారని తనకు న్యాయం చేయాలని పడిగ పుల్లయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. కానీ అతడి ఫిర్యాదు టేకులపల్లి మండల తహశీల్దార్ కార్యాలయానికి బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు అధికారులు. ఇక టేకులపల్లి తహశీల్దార్ కార్యాలయం అధికారులు రైతు సుమారు నాలుగైదు సార్లు రిమైండర్లు పెట్టినా ఇప్పటికి అతడి ఫిర్యాదును పట్టించుకోలేదు.
ఇదే రకంగా తన భూమిపై మరొక వ్యక్తి రైతుబందు పొందుతున్నాడని జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే అక్కడ కూడా నిరాశే ఎదురైంది. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోక పోగా చాలా రోజులకు జిల్లా కార్యాలయం నుండి ఒక అధికారిణి విచారణ అంటూ మండల వ్యవసాయ శాఖ కార్యాలయానికి వచ్చి పడిగ పుల్లయ్యను పిలవండి స్టేట్ మెంట్ తీసుకోవాలి అన్నది తప్ప రైతుకు తరఫున తెచ్చిన భూమి వివరాలు కనీసం చూడనైనా చూడలేదు.
అసలు దీనంతటికీ కారణం అయిన చింత పుల్లయ్య అనే రైతును ఏ అధికారి కూడా ఆధారాలు కావాలని కార్యాలయానికి పిలవక పోవడం విడ్డూరం. పైగా సదరు బాధిత రైతు ప్రజావాణిలో ఫిర్యాదుతో పాటు అన్ని వివరాలు సమర్పించినా మళ్ళీ మళ్ళీ కార్యాలయానికి రమ్మని పిలవడం వెనుక అధికారుల అంతరార్థం ఏమిటో అర్థంకాని బాధితుడు తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం సదరు రైతు యొక్క కేసును ఎందుకు తీసుకోకూడదో తెలపాలని షోకాజు నోటీసులు జారీ చేసింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కొత్తగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి టేకులపల్లి మండల తహశీల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మండల వ్యవసాయ అధికారి మరియు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అంతే కాకుండా 161/26 లో పడిగ పుల్లయ్యకు గల నాలుగు ఎకరాల భూమిపై ఇక ఎలాంటి లావాదేవీలు జరుపరాదని టేకులపల్లి మండల తహశీల్దారును ఆదేశించి ఈ కేసును వచ్చే నెలకు వాయిదా వేసింది.