ఖమ్మం జిల్లాలో .. గొర్రెల స్కాంపై ఎంక్వైరీ స్పీడప్
ఇప్పటి వరకు 32 మందికి షోకాజ్ నోటీసులు
వారంలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశం
రూ.20 కోట్ల మేర అవకతవకలు జరిగినట్టు అంచనా
అంబులెన్సులో గొర్రెలు తరలించినట్టు రికార్డులు
త్వరలోనే విచారణకు రానున్న ఏసీబీ అధికారులు
ఖమ్మం జిల్లాలో గొర్రెల పంపిణీలో జరిగిన అక్రమాలపై ఎంక్వైరీ నడుస్తోంది. ఈ స్కాంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) ఇటీవల నివేదిక ఇవ్వగా, అందులోని అంశాల ఆధారంగా పశుసంవర్థక శాఖ అధికారులు ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తున్నారు. ఆరోపణలు ఉన్న మండలాల్లోని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 32 మందికి షోకాజ్ నోటీసులు పంపించారు.
ఇందులో 27 మంది వెటర్నరీ డాక్టర్లు, ఐదుగురు సెంట్రల్ ప్రొక్యూర్ మెంట్ టీమ్(సీపీటీ) సభ్యులు ఉన్నారు. కాగ్ నివేదికలోని అంశాలపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నారు. సమాధానం వచ్చిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్ర స్థాయిలో గొర్రెల స్కాంపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు త్వరలోనే ఖమ్మం రానున్నట్టు తెలుస్తోంది.
ఒకే ఇన్వాయిస్పై 20 సార్లు..
బీఆర్ఎస్హయాంలో గొర్రెల పంపిణీ పథకాన్ని తీసుకొచ్చాక ఖమ్మం జిల్లాలో తొలి విడతలో 15,660 మందికి గొర్రెలను పంపిణీ చేశారు. యూనిట్ విలువను రూ.1.25 లక్షలుగా నిర్ణయించి, ఇందులో రూ.93,750ను సబ్సిడీగా ఇచ్చారు.
లబ్ధిదారులు తమ వాటా కింద 25 శాతం అంటే రూ.43,750తో డీడీ తీశారు. అలా డీడీలు తీసిన వారిలో తొలి విడతను పూర్తిచేయగా, రెండో విడతలో 16,639 మందికి గొర్రెల యూనిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఒక్కో యూనిట్ లో 20 గొర్రెలతో పాటు ఒక గొర్రె పోతు ఉంటుంది.
అయితే రెండో విడతలో సబ్సిడీ మొత్తాన్ని రూ.50 వేలకు పెంచి యూనిట్ విలువను రూ.1.75 లక్షలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత రెండో విడత గొర్రెలను పంపిణీని వాయిదా వేస్తూ రాగా, ఈలోగా ప్రభుత్వం మారిపోయింది.
బీఆర్ఎస్ హయాంలో గొర్రెల పంపిణీలో జరిగిన అక్రమాలు బయటపడ్డాయి. గొర్రెలను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి తీసుకురావడం, బీమా కల్పించడం అధికారుల బాధ్యత.
ఇందులోనే భారీగా అక్రమాలు, అవకతవకలు జరిగినట్టు కాగ్ నివేదికలో తేలింది. అంబులెన్సుల్లో గొర్రెలను తీసుకొచ్చినట్టు రికార్డు చేశారని, ఒకే ఇన్ వాయిస్ పై 20 సార్లకు పైగా బిల్లులు నమోదు చేశారని,
ఇన్ వాయిస్ నంబర్లను కూడా పెన్నుతో దిద్దారని, ఇన్ వాయిస్ పై సీరియల్నంబర్లేకుండానే బిల్లులు కాజేశారని కాగ్ రిపోర్టు స్పష్టం చేసింది. దాదాపు రూ.20 కోట్ల మేర ఖమ్మం జిల్లాలో అక్రమాలు జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.
ఫేక్ ఇన్వాయిస్లతో..
జిల్లాలో మొదటి విడతలో పంపిణీ చేసిన గొర్రెల యూనిట్లను ఏపీలోని కడప, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం, కర్ణాటకలోని రాయచూర్జిల్లాల నుంచి మొత్తం 2,700 వాహనాల్లో తీసుకువచ్చారు.
ఇక్కడి నుంచి ఒక వెటర్నరీ డాక్టర్, సెంట్రల్ ప్రొక్యూర్ మెంట్ టీమ్ సభ్యుడితోపాటు లబ్ధిదారులు కలిపి టీమ్ గా వెళ్లి గొర్రెలను కొనుగోలు చేసి తీసుకొచ్చారు. ఆ సమయంలో అక్కడి డాక్టర్లు ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఇస్తారు.
మొత్తం 99 ట్రిప్పుల్లో తీసుకువచ్చినట్టు చెబుతున్న బిల్లులపై కాగ్ పలు సందేహాలను వ్యక్తం చేసింది. ఏపీ నుంచి ఖమ్మం జిల్లాకు నాలుగు యూనిట్లను (84 గొర్రెలు) ఏపీ16 డబ్ల్యూ 7585 వాహనంలో తీసుకువచ్చినట్టు రికార్డుల్లో నమోదు చేశారు.
ఆ రిజిస్ట్రేషన్ నంబర్ ఒక అంబులెన్స్ ది అని కాగ్ నివేదికలో తేల్చింది. ఒకే ఇన్ వాయిస్ పై 20కి పైగా బిల్లులు చెల్లించినట్టు గుర్తించింది.
ఫేక్ఇన్ వాయిస్ లతో గొర్రెలను రవాణా చేయకుండానే చేసినట్లు బిల్లులు చూపించారని కాగ్ తేల్చింది. ఇక 69 ఎంట్రీల్లో ఇన్ వాయిస్ నంబర్లను పెన్నుతో దిద్దినట్టు గుర్తించారు.
అయితే కొనుగోళ్ల దగ్గర నుంచి, గొర్రెలను లబ్ధిదారుల ఇళ్లకు చేర్చే వరకు బాధ్యత వహించాల్సిన వెటర్నరీ డాక్టర్లకు ఇప్పుడు షోకాజులు అందాయి. బిల్లుల్లో దిద్దివేతలు, వాహనాల నంబర్లలో తేడాలు, ఇన్ వాయిస్ లలో తప్పులపై పూర్తి స్థాయి ఎంక్వైరీ తర్వాత బాధ్యులెవరో తేల్చనున్నారు.
అక్రమాలు తేలితే చర్యలుంటాయ్
ఖమ్మం జిల్లాలో గొర్రెల కొనుగోళ్లలో పొరపాట్లు తప్ప అక్రమాలు జరగలేదని పశు సంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు.కాగ్ నివేదికలో చెబుతున్న వాహనం నంబర్ ఏపీ16 టీడబ్ల్యూ 7585లో గొర్రెలను తీసుకువచ్చారని, ఇన్ వాయిస్ లో నమోదు చేస్తున్న సమయంలో ఒక అక్షరం రాయకపోవడంతో అంబులెన్స్ నంబర్ గా చూపిస్తోందని ఆఫ్ ది రికార్డు చెబుతున్నారు.
బిల్బుక్ లో పేజీలు అయిపోవడంతో ట్రాన్స్ పోర్ట్ డీలర్ ఒకే ఇన్ వాయిస్ ను జిరాక్స్ తీసి బిల్లులను పెట్టుకున్నాడని అంటున్నారు. నిజంగానే అక్రమాలు జరిగాయని ఎంక్వైరీలో తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, వాళ్ల నుంచి డబ్బును సైతం రికవరీ చేస్తామని చెబుతున్నారు.