ఐదెకరాలా.. పదెకరాలా?
రైతు భరోసాకు సీలింగ్ పెట్టే యోచనలో సర్కారు
ఐదెకరాలకే పరిమితం చేయాలని అధికారుల సూచన
ఐటీ రిటర్న్ లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలకు నో
మార్గదర్శకాల రూపకల్పనలో వ్యవసాయ శాఖ అధికారులు బిజీ..
త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక
సర్కారు నిర్ణయం ఆధారంగా వచ్చే వానాకాలం నుంచే రైతు భరోసా!
హైదరాబాద్: రైతులకు పంట పెట్టుబడికోసం ఆర్థిక సాయం అందించే రైతుభరోసా (రైతుబంధు) పథకానికి సీలింగ్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఈ సాయాన్ని ఐదెకరాలకా లేదా పదెకరాలకా.. ఎంతకు పరిమితం చేస్తే బాగుంటుందన్న దానిపై తర్జనభర్జన పడుతోంది.
ఐదెకరాలకే పరిమితం చేస్తే బాగుంటుందని అధికారులు సూచిస్తున్నట్లు సమాచారం. అంతేగాకుండా ఆదాయ పన్ను చెల్లిస్తున్నవారు, రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సెలబ్రిటీలకు రైతుభరోసా ఇవ్వకూడదని భావిస్తున్నట్టు తెలిసింది.
ఇటీవలి బడ్జెట్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధును పునఃసమీక్షిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకంతో అనర్హులు కూడా లబ్ధి పొందుతున్నారన్నది కొత్త సర్కారు ఉద్దేశం. దీనికి అనుగుణంగా ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు ఢిల్లీలోని ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్’ను సంప్రదించారు.
ఉపగ్రహ చిత్రాల ద్వారా సాగు, బీడు భూములను గుర్తించి.. ఆ వివరాల ఆధారంగా రైతు పెట్టుబడి సాయానికి పరిమితులు విధించనున్నారు. దీనిపై మార్గదర్శకాలను రూపొందించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా వచ్చే వానాకాలం సీజన్ నుంచి కొత్త మార్గదర్శకాల ప్రకారం రైతుభరోసా అమలులోకి రానుంది.
ఇచ్చే మొత్తం పెంచి.. 90% మందికే ఇచ్చి..
రైతుబంధు పథకం 2018 వానాకాలం సీజన్ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదట్లో ప్రతీ సీజన్‌కు ఎకరాకు రూ.4 వేల చొప్పున రైతులందరికీ ఇచ్చారు. ఇలా ఏడాదిలో రెండు సీజన్లకు కలిపి ఎకరానికి రూ.8 వేల చొప్పున అందేవి.
తర్వాత ఈ సొమ్మును ప్రభుత్వం సీజన్‌కు రూ.5 వేల చొప్పున ఏడాదికి రూ. 10 వేలు చేసింది. అంటే రెండు సీజన్లు కలిపి 1.52 కోట్ల ఎకరాలకు చెందిన 68.99 లక్షల మంది రైతులకు ఏటా సుమారు రూ.15,250 కోట్లు అందజేశారు.
కాంగ్రెస్ సర్కారు రైతుభరోసా కింద ఎకరాకు ఏటా రూ.15 వేలు ఇస్తామని ప్రకటించింది. ఈ లెక్కన 1.52 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ.22,800 కోట్లు అవుతుంది. అలాకాకుండా ఐదెకరాలలోపు భూమి ఉన్న రైతులనే పరిగణనలోకి తీసుకుంటే.. పెట్టుబడి సాయం అందుకుంటున్న రైతుల్లో వారు 62.34 లక్షల మంది ఉన్నారు. అంటే.. మొత్తం లబ్దిదారుల్లో 90.36 శాతం.
వీరికి మాత్రమే రైతుభరోసా పరిమితం చేయాలనుకుంటే.. రూ. 15వేల కోట్లు ఇస్తే సరిపోతుందని అంచనా. దీనివల్ల గత ప్రభుత్వం కన్నా రూ.5 వేలు ఎక్కువ ఇచ్చినట్టు ఉంటుందని.. అదే సమయంలో ఏటా ఇచ్చే మొత్తంలో పెద్దగా మార్పు ఉండదని అధికార వర్గాలు చెప్తున్నాయి. పైగా రూ. 7,800 కోట్లు ఆదా చేసుకోవచ్చని అంటున్నాయి.
వాళ్లందరికీ కట్..!
సాగుభూములకే రైతుభరోసా ఇస్తామని కొత్త ప్రభుత్వం ప్రకటించింది. సాగుచేయని, సాగుకు పనికిరాని కొండలు, గుట్టలకు, ఆఖరికి రోడ్లు ఉన్న స్థలాలకు కూడా రైతుబంధు ఇచ్చారని ప్రస్తుత ప్రభుత్వం చెప్తోంది.
ఈ నేపథ్యంలో రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా సాగు, బీడు భూములను గుర్తించనున్నామని.. తద్వారా అనర్హులను తొలగిస్తామని వ్యవసాయ శాఖ చెబుతోంది.
అలాగే రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలు, ఆదాయ పన్ను కట్టేవారికి కూడా పెట్టుబడి సాయం ఇవ్వకూడదని భావిస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వంపై రైతుభరోసా భారం మరింత తగ్గుతుందని పేర్కొంటున్నారు.