ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్..
నలుగురు మావోయిస్టులు హతం.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
ఫిబ్రవరి 27,
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని చోటే తుంగాలి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య చాలాసేపు ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.
భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకోవడంతో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు ముమ్మర గాలింపు చేపట్టారు. ఆ ప్రాంతంలో ఇంకా ఎవరైనా మావోయిస్టులు దాగి ఉన్నారా అని సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.
ఎలాంటి అనుమానాస్పద కదలికలు కనిపించినా వదలకుండా గాలిస్తున్నారు.చోటే తుంగాలి అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, సీఆర్‌పీఎఫ్ జవాన్లు ఉదయం 11 గంటలకు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలోనే జంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు.
దీంతో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నక్సల్స్ కాల్పులు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులను మట్టు బెట్టినట్లు పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మృతదేహాలను కూడా గుర్తించినట్లు పేర్కొన్నారు.సోమవారం పోలీసులకు ఓ మావోయిస్టు లొంగిపోగా.. ఆ తర్వాతి రోజే ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకోవడం గమనార్హం.
లొంగిపోయిన మావోయిస్ట్‌పై రూ.8 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. ఇక ఇటీవలె సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ లో ఒకరు చనిపోగా.. ఆ తర్వాత ఆదివారం కాంకేర్ జిల్లాలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో మరో ముగ్గురు హతమైనట్లు పోలీసులు వెల్లడించారు.
బుర్కలంక అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, డీఆర్‌జీ జవాన్లకు మధ్య ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్ట్ చనిపోయాడు. ఆదివారం ఉదయం కాంకేర్ జిల్లాలో లోని కోయలిబేడా అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ , బీఎస్‌ఎఫ్ జవాన్లు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.
దీంతో ముగ్గురు మావోయిస్టులు మరణించారని జిల్లా ఎస్పీ ఇందిర కల్యాణ్ చెప్పారు. సంఘటనా స్థలంలో ముగ్గురి మృతదేహాలతోపాటు 2 తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అయితే ఈ ముగ్గురు మృతి చెందడంపై వారి కుటుంబ సభ్యులు మాత్రం వేరే వాదనను వినిపిస్తున్నారు.
అసలు ఆ ముగ్గురు మావోయిస్టులే కాదని వారి కుటుంబాలు చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఫేక్ ఎన్‌కౌంటర్ చేసి.. సామాన్యులను కాల్చి చంపి.. అది నక్సల్స్ ఏరివేత అని చెబుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. దీంతో అసలు వాళ్లు మావోయిస్టులా లేక సాధారణ పౌరులా అని చర్చకు తెరతీసింది…