మంత్రులు భట్టి, ఉత్తమ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం
నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయలుదేరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్ ఒకేరోజు రెండుసార్లు సాంకేతిక లోపంతో నిలిచి పోయింది.
దీంతో మంత్రుల పర్యటనలకు పలుచోట్ల ఇబ్బందులు ఏర్పడ్డాయి. హైదరాబాద్ నుంచి బయలుదేరిన మంత్రులు ఇద్దరు సూర్యాపేటకు చేరుకోగా.. సూర్యాపేటలో హెలికాప్టర్ మొరాయించింది. దీంతో సూర్యాపేట నుంచి కోదాడ వరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు రోడ్డు మార్గంలో కోదాడకు వెళ్లారు.
ఆ తర్వాత సాంకేతిక లోపాన్ని సరిచేసుకున్న హెలికాప్టర్.. తిరిగి కోదాడకు చేరుకొని.. కోదాడలో ఉన్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను తీసుకొని వైరాకు చేరుకుంది. మధిరలో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత తిరిగి వైరాకి రావాల్సి ఉండగా మళ్లీ హెలికాప్టర్ మొరాయించింది.
దీంతో మధిర నుంచి వైరా వరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్‌లు మొత్తం రోడ్డు మార్గంలోనే వైరాకు చేరుకున్నారు. వైరాలో శంకుస్థాపన చేసిన అనంతరం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు హెలికాప్టర్ ఎక్కి వెళ్లి పోయారు. కాగా బహిరంగ సభలో మంత్రి తుమ్మల సభలో పాల్గొన్నారు.