దిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు.
దిల్లీ జల మండలిలో చోటుచేసుకున్న అవకతవకలకు సంబంధించిన కేసులో మార్చి 21న ఈడీ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. ఇలా కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు ఇవ్వడం వరుసగా తొమ్మిదోసారి.
గతంలో దిల్లీ మద్యం పాలసీ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఎనిమిది సార్లు సమన్లు జారీ చేసింది. వీటికి ఆయన స్పందించకపోవడంతో దిల్లీ కోర్టులో ఈడీ రెండు ఫిర్యాదులు నమోదు చేసింది. దీనిపై శనివారం విచారణ సందర్భంగా కేజ్రీవాల్ కోర్టు ముందు హాజరయ్యారు.
చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. మరుసటి రోజే తాజాగా మరో కేసులో ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది.
తొలుత ఈ సమన్లు దిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి జారీ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.
వీటిని ఆప్ నేతలు ఖండించారు. తాజా సమన్లు దిల్లీ జలమండలికి సంబంధించిన కేసులో జారీ చేసినట్లు దిల్లీ మంత్రి అతిశీ తెలిపారు. ‘‘దిల్లీ జలమండలి బోర్డు కేసు గురించి ఎవరికీ తెలియదు. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను అరెస్టు చేయలేమని భావించిన కేంద్రం మరో తప్పుడు కేసుతో ఆయన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది.
లోక్‌సభ ఎన్నికల్లో ఆయన్ను ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకు భాజపా పన్నిన కుట్రలో భాగమే తాజా సమన్లు. గతంలో కూడా కేజ్రీవాల్‌ను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేసేందుకునే దిల్లీ మద్యం కేసులో సమన్లు జారీ చేశారు’’ అని ఆరోపించారు.