హైకోర్టు షోకాజుకు స్పందించరు – స”హ” దరఖాస్తుకు సమాచారమివ్వరు
ప్రజా ప్రయోజనం “లేనట్టుగా” ఉందని చెప్పిన పి.ఐ.ఓ
తప్పించుకోవడానికే సెక్షన్ 8(1)(జె)ను అడ్డు పెడుతున్నరు
ఇన్ని తెలిసిన పిఐఓ కి నెల రోజుల నిబంధన గురించి తెలియదా?
భద్రాద్రి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో నీరుగారుతున్న స”హా” చట్టం
షోకాజుకు భాధ్యత తమది కాదన్న రాష్ట్ర కార్యాలయాలు మరియు జిల్లా కలెక్టర్ కార్యాలయం
సి కె న్యూస్ (భద్రాద్రి కొత్తగూడెం) మార్చి 20: సమాచార హక్కు చట్టం వచ్చి రెండు దశాబ్దాలు కావస్తున్నా ఇంకా చట్టం నిబంధనలపై అధికారులకు కనీస అవగాహన ఉండడం లేదు. నిజానికి అవగాహన లేదని చెప్పడం కంటే చట్టంలోని నిబంధనలకు వక్ర భాష్యం చెబుతూ సమాచార హక్కు చట్టాన్ని పక్కదారి పట్టిస్తున్నారని చెప్పడం సబబుగా ఉంటుంది.
సెక్షన్ 8(1)(జె)ని సమాచారం ఇవ్వకుండా తప్పించుకోవడానికి విరివిగా ఉపయోగిస్తున్నారు కొందరు పౌర సమాచార అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 104 డ్రైవరుగా ఔట్ సోర్సింగ్ పద్దతిలో ఉద్యోగం చేస్తున్న కె.శంకర్ అనే వ్యక్తిని సరైన కారణాలు లేకుండా విధుల్లోనుండి తొలగించారు.
ఈ విషయంలో పోయినేడాది మార్చి నెలలో తనను అన్యాయంగా ఉద్యోగం నుండి తొలగించారని తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసులో వైద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ భద్రాద్రి జిల్లా కలెక్టర్ మరియు భద్రాద్రి జిల్లా వైద్య శాఖ అధికారులకు హైకోర్టు షోకాజులు ఇచ్చింది.
సంవత్సరం దాటినా ఇప్పటివరకూ ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ హెల్త్, జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో ఏం చెప్పారన్నది బాధితుడికి ఇప్పటివరకూ తెలియలేదు.
కేసు ముందుకు కదలక పోవడంతో అసలు హైకోర్టు ఇచ్చిన షోకాజు నోటీసులకు అధికారులు సమాధానం ఇచ్చారా లేదా అని తెలుసుకోవడం కోసం జిల్లాకు చెందిన మానవ హక్కుల కార్యకర్త అయిన గంగాధర కిశోర్ కుమార్ ను కలిసి సహాయం కోరాడు. దీని విషయమై అతను ప్రిన్సిపల్ సెక్రటరీ హైదరాబాద్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ హైదరాబాద్, భద్రాద్రి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఆరోగ్య శాఖ కార్యాలయాలకు ఏకరూప సమాచార దరఖాస్తును చేశాడు.
దరఖాస్తులో ఈ కేసుకు సంబంధించిన సమాచారం ఇవ్వడంలో బాధితుడికి ఎలాంటి అభ్యంతరం లేదని అదేవిధంగా కేసుకు సంబంధించిన సమాచారం విషయంలో కోర్టు ఏ విధమైన నిషేధం విధించలేదని కాబట్టి కేసు విషయంలో అందుబాటులో ఉన్న సమాచారం ఇవ్వాలని కోరాడు.
సెక్షన్ 8(1)(జె) లో ఏముంది?
“ప్రజా కార్యకలాపాలు, ప్రజా ప్రయోజనాలతో నిమిత్తం లేని వ్యక్తిగత సమాచారం. వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసి అవాంఛనీయ అవకాశం కల్పించే సమాచారం. విశాల ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ తరహా సమాచారాల వెల్లడి ఉచితమేనని కేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారి లేక అప్పీలేట్ అధికారి భావిస్తే ఈ తరహా సమాచారాలను కూడా వెల్లడి చేయవచ్చు.
పార్లమెంటుకు లేక రాష్ట్ర శాసన సభకు అందించదగిన ఎలాంటి సమాచారాన్ని అయినా ఏ వ్యక్తికైనా అందించవచ్చు.” ఇదీ సెక్షన్ 8(1)(జె) యొక్క సారాంశం. దీన్ని పౌర సమాచార అధికారి తమకు అనుకూలంగా మలుచుకుని సమాచారాన్ని నిరాకరిస్తున్నారు. ఇక్కడ ప్రజా కార్యకలాపాలు, ప్రజా ప్రయోజనాలతో నిమిత్తం లేని వ్యక్తిగత సమాచారం ఏముందో పౌర సమాచార అధికారిగా ఉన్న ఏఓ చెప్పాలి.
ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని విధుల్లో నుండి తొలగించిన కేసులో హైకోర్టు ఇచ్చిన నోటీసుకు సమాధానం ఇచ్చారా లేదా అనే విషయం ఎవరి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తుంది? పిటిషనర్ అయిన వ్యక్తికి తన కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకునే హక్కు తప్పకుండా ఉంటుంది.
సదరు ఉద్యోగి సమాచారం ఇవ్వడం వలన తనకు ఎలాంటి ఇబ్బందీ లేదని స్పష్టం చేసిన తర్వాత కూడా సమాచారాన్ని అడ్డుకోవడం కేవలం జరిగిన తప్పులు కప్పి పుచ్చుకోవడానికి అని ఎవరికైనా అర్థమవుతుంది. అయితే ఎవరిని రక్షించుకోవాలని పౌర సమాచార అధికారి ప్రయత్నిస్తున్నారో తెలియాల్సి ఉంది.
దరఖాస్తుదారుడి అభిప్రాయం:
నిబంధనలకు విరుద్ధంగా ఉద్దేశ్య పూర్వకంగానే పౌర సమాచార అధికారి సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 8(1)(j) ని అడ్డు పెట్టుకొని సమాచారాన్ని నిరాకరిస్తున్నారు.
ప్రస్తుత కేసులోని ప్రజా ప్రయోజనాన్ని పౌర సమాచార అధికారి ఏ విధంగా అంచనా వేస్తున్నారు? ప్రజా ప్రయోజనం లేనట్టుగా ఉందని చెప్పడం వల్ల ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని స”హ” దరఖాస్తుకు అంటగడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
ఇకపోతే సహ దరఖాస్తుకు ఇచ్చిన సమాధానం ఈ కేసులో బాధితుడికి జరిగిన అన్యాయంలో పౌర సమాచార అధికారిగా ఉన్న జిల్లా ఆరోగ్య శాఖ కార్యాలయం ఏ.ఓ పాత్ర పై అనుమానాలు రేకెత్తించేలా ఉంది. ప్రిన్సిపల్ సెక్రటరీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ మరియు జిల్లా కలెక్టర్ కార్యాలయాలలో ఉన్న పౌర సమాచార అధికారులెవరికీ అడ్డురాని సెక్షన్ 8(1)(j) జిల్లా ఆరోగ్య శాఖ కార్యాలయంలో పౌర సమాచార అధికారిగా ఉన్న ఏ.ఓ కు అడ్డురావడం విడ్డూరమే.
ఇలాంటి సమాధానాల ఇవ్వడం అంటే కార్యాలయంలో ఏదో తప్పు జరుగుతుందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లే అవుతుంది. అసందర్భంగా అవగాహన లేకుండా ఇచ్చే ఇలాంటి సమాధానాలు పరిస్థితులను మరింత జఠిలం చేస్తాయి. ఇప్పటికే జిల్లా వైద్య శాఖలో ఎన్నో అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం అధికారులకు ఉంటుంది. నిబంధనలకు వక్ర భాష్యం చెప్పి ఎన్నో రోజులు తప్పించుకోలేరు.
రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికైనా సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుత సహ చట్టం నిబంధనలు అనుసరించి మొదటి అప్పీలు చేస్తా. తప్పు సరిదిద్దుకోవడానికి పౌర సమాచార అధికారికి ఉన్న చివరి అవకాశం ఇది.ఈ అవకాశాన్ని పౌర సమాచార అధికారి సద్వినియోగం చేసుకుంటారనే అనుకుంటున్నాను.
-గంగాధర కిశోర్ కుమార్, అంతర్జాతీయ మానవ హక్కులు మరియు నేర నిరోధక సంస్థ శాశ్వత సభ్యులు