ప్రభుత్వ ఆసుపత్రిలో మోకీలు మార్పిడి
సికె న్యూస్ ప్రతినిధి
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఓ వివాహితకు మోకీలు మార్పిడి చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు.
ప్రస్తుతం ఆమె కోలుకోవడంతో గురువారం డిశ్ఛార్జి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుకు చెందిన ఏళ్ల మల్లీశ్వరి(56) కొన్నేళ్లుగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతోంది.
గతంలో పలు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నప్పటికీ నయం కాలేదు. శస్త్ర చికిత్స అవసరమని తేల్చడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా కుటుంబీకులు ఈనెల 11న ఖమ్మం సర్వజనాసుపత్రిలో చేర్పించారు.
వైద్య పరీక్షల అనంతరం మోకీలు మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. రూ.2 లక్షల విలువైన చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో నిర్వహించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎల్.కిరణ్‌కుమార్ తెలిపారు.
ఆర్థో విభాగం వైద్య బృందం హనుమాన్సింగ్, మదన్‌సింగ్, వినయ్, రాజేశ్ చికిత్స అందించిన వారిలో ఉన్నారు. డిశ్చార్జి సమయంలో బాధితురాలిని ప్రిన్సిపల్ రాజేశ్వరరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ బి.కిరణ్‌కుమార్ పరామర్శించి వైద్య బృందాన్ని అభినందించారు.