లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా
భూమి రిజిస్ట్రేషన్ విషయంలో మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్
తస్లీమా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యండెడ్ గా చిక్కారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ముందస్తు సమాచారంతో సాయంత్రం వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఇన్స్పెక్టర్లు శ్యాంసుందర్, రాజు, సునిల్ తో కలిసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దాడులు నిర్వహించారు.
దాట్ల గ్రామానికి చెందిన గుండెగాని హరీష్ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా వెంకట్, సబ్ రిజిస్ట్రార్ తస్లీమాను పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య మీడియాకు తెలిపారు.
ప్రస్తుతం ఇద్దరిని అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. శనివారం ఉదయం వరంగల్లోని ఏసీబీ కోర్టులో ప్రోడ్యూస్ చేయనున్నట్లు తెలిపారు.
అసలేం జరిగిందంటే…?
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన గునిగంటి హరీష్ కొద్దిరోజుల క్రితం దంతాలపల్లిలో 128గుంటల భూమిని కొనుగోలు చేశాడు. ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు మహబూబాబాద్ లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లిన ఆయనకు నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజు కంటే అదనంగా డబ్బులు డిమాండ్ చేశారు. ఈవిషయంపై సబ్ రిజిస్ట్రార్ తస్లీమాను కలిసినా.. అదే రీతిలో మాట్లాడుతూ కార్యాలయ ఉద్యోగి వెంకట్ను కలవాలని సూచించారు.
వెంకట్ ను హరీష్ కలవగా నిబంధనల ప్రకారం స్వ్కేర్ యార్డుకు రూ. 105లు ఉండగా, 200లు అదనంగా చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని వెల్లడించాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని హరీష్ వరంగల్లోని ఏసీబీ డీఎస్పీ కార్యాలయంలో అధికారులను ఆశ్రయించాడు.
అధికారుల సూచనలతో మళ్లీ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి వెంకట్ను కలిసి స్క్వేర్ యార్డుకు రూ.150 వరకు చెల్లిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఏసీబీ అధికారులు చెప్పిన విధంగా శుక్రవారం సాయంత్రం అమౌంట్ ను ముట్టజెప్పేందుకని రూ.19200 తీసుకుని వెంకట్, తస్లీమా వద్దకు వెళ్లాడు.
హరీష్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వెంకట్లను రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య బృందం పధకం ప్రకారం పట్టుకుంది. ఈ సంఘటనలో 19200 స్వాధీనం చేసుకున్నారు. అలాగే కార్యాలయంలో సోదాలు నిర్వహించిన అధికారులకు రూ.1,72,000 లెక్కతేలని అమౌంట్ను స్వాధీనం చేసుకున్నారు.
ఆ మొత్తం అంతా కూడా ఈ రోజు కలెక్షన్గా భావిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య విలేకరులకు తెలిపారు. దీనిపై వారు ఎలాంటి వివరణ ఇస్తారో చూస్తామని చెప్పారు.
ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ తస్లీమాతో పాటు వెంకట్ ను అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్ ఏసీబీ కోర్టులో శనివారం ఇద్దరిని ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు.