మరో మూడ్రోజులు కస్టడీకి కవిత..
నేటితో కవిత ఈడీ కస్టడీ ముగియడంతో.. మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ న్యాయస్థానాన్ని కోరింది. ఈడీ వాదన విన్న ధర్మాసనం.. కస్టడీ పొడిగింపుపై నిర్ణయాన్ని రిజర్వ్ చేసిన.. ధర్మాసనం మరో మూడు రోజులు కస్టడీకి అనుమతించింది.
దీంతో కవితకు షాక్ తగిలినట్లైంది. ఈ మూడురోజులు ఈడీ అధికారులు కవిత, కేజ్రీవాల్ ను కలిపి ప్రశ్నించనున్నారు. వారిద్దరి ఫోన్ కాల్స్, చాట్ డేటాను ముందుంచి విచారించనున్నారు.
కాగా.. కవిత యథావిధిగా తనను అక్రమంగా అరెస్ట్ చేశారని వాపోయింది. ఇది పూర్తిగా రాజకీయ కల్పిత కేసు అని పేర్కొన్నారు. ఏడాది క్రితం ఈడీ తనను ఏయే ప్రశ్నలు అడిగిందో.. ఇప్పుడు కూడా అవే ప్రశ్నలు అడిగారని చెప్పారు.
తన అరెస్ట్ పై న్యాయపోరాటం చేస్తానన్నారు. పిల్లల్ని కలిసేందుకు అనుమతివ్వాలని కవిత తరపు లాయర్ న్యాయస్థానాన్ని కోరారు.
లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే వారంరోజులు కవితను విచారించిన ఈడీ.. అఫిడవిట్ దాఖలు చేసింది. ఢిల్లి మద్యం కుంభకోణంలో కవిత మేనల్లుడైన మేక శరణ్ పాత్రపై ప్రశ్నించగా తనకేమీ తెలియదని ఆమె సమాధానమిచ్చారని ఈడీ పేర్కొంది.
ప్రస్తుతం ఈడీ మేక శరణ్ పై ఈడీ ఫోకస్ పెట్టింది. సౌత్ లాబీ డబ్బు లావాదేవీల్లో మేక శరణ్ కీలకపాత్ర వహించినట్లు ఈడీ భావిస్తోంది. అదే నిజమని తేలితే.. నెక్ట్స్ అరెస్ట్ చేసేది అతడినే. ప్రస్తుతం ఆయన ఇంట్లో సోదాలు జరుపుతోంది.
మరోవైపు సుప్రీంకోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ ను విచారించిన ధర్మాసనం.. బెయిల్ ఇవ్వడం కుదరదని, ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కవిత ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు.
మరోవైపు తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని కవిత పీఎంఎల్ఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ విచారణ సమయంలో ఆమె తీవ్ర రక్తపోటును ఎదుర్కొంటున్నారు. మందులు వాడినా బీపీ కంట్రోల్ అవ్వడం లేదని, ఈడీ అధికారులు మెడికల్ రిపోర్ట్స్ కూడా ఇవ్వడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారామె.
తన హెల్త్ రిపోర్ట్స్ ఇచ్చేలా ఈడీకి ఆదేశాలు ఇవ్వాలని కవిత దాఖలు చేసిన పిటిషన్ లో కోరారు. తనకు మార్చి 15,16వ తేదీల్లో చేసిన హెల్త్ రిపోర్ట్స్ మాత్రమే ఇచ్చారని, ఆ తర్వాతి రిపోర్టులను ఇవ్వలేదని చెప్పారు.