మోడీ కి వ్యతిరేకంగా 600 మంది లాయర్ల లేఖ..
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్న వేళ జాతీయ స్ధాయిలో ప్రముఖులైన 600 మంది లాయర్లు ఇవాళ సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కు ఓ లేఖ రాశారు.
ఇందులో లాయర్లు ఎన్నికల వేళ న్యాయవ్యవస్ధపై ఒత్తిడి తెచ్చి కోర్టు తీర్పును ప్రభావితం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాలని సీజేఐని కోరారు. ఈ లేఖపై స్పందించిన ప్రధాని మోడీ.. ఎక్స్ లో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు.
దేశంలో ఓ స్వార్ధ ప్రయోజనాల కూటమి ఎన్నికల వేళ న్యాయవ్యవస్ధను ప్రభావితం చేసేందుకు, అపఖ్యాతి పాలు చేసేందుకు తమ పనికిమాలిన వ్యూహాలతో, కాలం చెల్లిన రాజకీయ అజెండాలతో ప్రయత్నిస్తోందంటూ 600 మంది లాయర్లు సీజేఐకి రాసిన లేఖలో ఆరోపించారు. వారి చేష్టలు న్యాయవ్యవస్థ పనితీరుపై విశ్వాసం, సామరస్య వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయని విమర్శించారు.
రాజకీయ కేసులలో వారి ఒత్తిడి వ్యూహాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు.
ముఖ్యంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ ప్రముఖులు తమ కోర్టుల్ని దెబ్బతీస్తున్నారన్నారు. తద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పుగా మారారన్నారు.
వీరు వివిధ మార్గాల్లో పనిచేస్తున్నారని, కోర్టుల యొక్క ప్రస్తుత తీర్పుల్ని గతంలో పనితీరుకు లింక్ చేస్తూ తప్పుడు కథనాలను సృష్టిస్తున్నారని లాయర్లు ఆరోపించారు. ఇవి కోర్టు నిర్ణయాలను అడ్డం పెట్టుకుని కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కోర్టులను ఇబ్బంది పెట్టేందుకు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న పనులుగా అభివర్ణించారు.
ఇందులో భాగంగా కొందరు లాయర్లు పగలు రాజకీయ నేతలకు మద్దతుగా కోర్టుల్లో వాదిస్తారని, రాత్రి మీడియాను అడ్డంపెట్టుకుని న్యాయమూర్తుల్ని ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు.
అలాగే తమకు కావాల్సిన బెంచ్ లను ఎంచుకుని బెంచ్ ఫిక్సింగ్ కు కూడా పాల్పడుతున్నారని, ఇది న్యాయవ్యవస్ధ ప్రతిష్టకే మచ్చతెచ్చేలా ఉందని లాయర్లు ఆరోపించారు.
అలాగే ఎలాంటి చట్టబద్ధపాలన లేని దేశాల్లో కోర్టులతో మన కోర్టుల్ని పోల్చే స్దాయికి దిగజారారని విమర్శించారు. ఇది కచ్చితంగా ప్రజల్లో మన న్యాయవ్యవస్ధపై ఉన్న నమ్మకాన్ని పొగొట్టే కుట్రేనన్నారు. దీనిపై స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని సీజేఐని కోరారు.