లైసెన్సులు కలిగిన ఆయుధాలను తక్షణమే డిపాజిట్ చేయించాలి
ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ.ఎస్.దినేష్ కుమార్ ఐఏఎస్
లైసెన్సు లేని ఆయుధాల కట్టడికి ప్రత్యేక చర్యలు:
ప్రకాశం జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర్ రెడ్డి ఐపీఎస్
సి కె న్యూస్ ఒంగోలు ప్రతినిధి
జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున లైసెన్సులు కలిగిన ఆయుధాలను తిరిగి డిపాజిట్ చేయించాలని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్.దినేష్ కుమార్ ఆదేశించారు. కొత్తగా ఎలాంటి లైసెన్సులు మంజూరు చేయరాదని స్పష్టం చేశారు.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు లైసెన్సుడ్ ఆయుధాల డిపాజిట్, లైసెన్సు లేని ఆయుధాలు, ఇతర పేలుడు పదార్థాల స్వాధీనం, వాటి రవాణాను అడ్డుకోవడం, తదితర అంశాలపై జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర్ రెడ్డి ఐపీఎస్, ఏ.ఎస్.పి .కె. నాగేశ్వరరావు, డిఆర్ఓ ఆర్.శ్రీలత, జిల్లా జైలు సూపరింటెండెంట్ వరుణా రెడ్డి మరియు ఇతర అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ గురువారం ప్రకాశం భవనంలోని కలెక్టర్ చాంబర్లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
వ్యక్తిగత లైసెన్స్డ్ ఆయుధాలను అందరూ తిరిగి డిపాజిట్ చేసేలా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. లైసెన్సుల జారీ, ఆయుధాల రకాలకు సంబంధించిన వివరాలతో కూడిన రిజిస్టర్ లను పక్కాగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. పోలీసు, రెవెన్యూ అధికారుల మధ్య కామన్ డేటా ఉండాలని ఆయన సూచించారు.
లైసెన్సుదారులు చనిపోతే వారి వద్ద ఉన్న ఆయుధాల స్థితిగతులు, రాజకీయ నేపథ్యమున్న ఖైదీలు జైలులో నుంచి ప్రతివారం కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న కాల్ డేటా వివరాలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. శాంతియుత ఎన్నికల నిర్వహణ పైన ఇలాంటి ఖైదీలు ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపకుండా గట్టి నిఘా పెట్టాలని ఆయన సూచించారు.
దీనిపై ఎస్పీ స్పందిస్తూ లైసెన్స్ దారులు తమ ఆయుధాలను డిపాజిట్ చేసేలా ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి లైసెన్స్ ఆయుధం పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు చెప్పారు. గుర్తింపు లేని ఆయుధాల కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టామని, ఇలాంటివి రవాణా జరగకుండా నిఘా పెట్టామని తెలిపారు.
జైలులోని ఖైదీల నేర చరిత్ర, రాజకీయ నేపథ్య వివరాలను కూడా సంబంధిత అధికారుల ద్వారా తీసుకుని అలాంటి ఖైదీల అనుచరుల కదలికలను గమనిస్తున్నామన్నారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పర్యవేక్షిస్తున్నట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడీ వివరించారు.