ఐదు గ్యారెంటీలు, 25 హామీలతో కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఏఐసీసీ కార్యాలయంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే న్యాయ్ పత్ర -2024 పేరుతో 48 పేజీలతో కూడిన మేనిఫెస్టోను రిలీజ్ చేశారు.
ఈ మేనిఫెస్టోలో మహిళలు, రైతులు, యువతకు పెద్దపీట వేసింది కాంగ్రెస్. హిస్సేదారి న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్, నారీ న్యాయ్ పేర్లతో ఐదు గ్యారెంటీలను మేనిఫెస్టోలో రూపొందించింది.
ఒక్కో గ్యారెంటీ కింద ఐదేసి హామీలు.. మొత్తం 25 హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచింది. యువతకు ఉద్యోగాలు, రైతులకు కనీస మద్దతు ధర, కార్మికులకు రోజుకు కనీస వేతనం, కులగణన, ఆర్థిక సర్వే, సురక్షితమైన రాజ్యాంగం, పౌరుల హక్కులకు ఇంపార్టెన్స్ ఇస్తూ మేనిఫెస్టో రూపకల్పన చేశారు.
గృహలక్ష్మి పథకం ద్వారా మహిళల ఖాతాల్లోకి నగదు జమ, రూ.450కి వంటగ్యాస్ సిలిండర్, బస్సు జర్నీలో మహిళలకు రాయితీ, రైతులకు కనీస మద్దతు ధరపై హామీ, వ్యవసాయ పరికరాల ధరలపై జీఎస్టీ మినహాయింపు, పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు, కులగణన ఆధారంగా రిజర్వేషన్ల కల్పన, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగింపు, న్యాయ్ యోజన ద్వారా పేద కార్మిక కుటుంబాలకు ఏడాదికి రూ.72 వేల సహాయం, రైల్వే ఛార్జీల తగ్గింపు, వృద్ధులకు టికెట్లపై రాయితీ, రైల్వేల ప్రైవేటీకరణ నిలిపివేత, చిన్నతరహా పరిశ్రమల రుణాలను మాఫీ చేసి.. తక్కువ వడ్డీకి రుణాల పంపిణీ వంటి హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచారు.