వాళ్ళు చేసి… మమ్మల్ని అంటున్నారు… మంత్రి పొంగులేటి
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ మే ధ్యేయంగా పనిచేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
సోమవారం వైరా నియోజకవర్గ కేంద్రంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. కేసీఆర్ నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు దెబ్బతిన్నదని.. ఆ పరిస్థితుల్లో నీటిని మొత్తం వేస్ట్‌గా దిగువ ప్రాంతాలకు వదిలారన్నారు.
ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం.. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే నీటి కొరత ఏర్పడిందని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. రైతులను రెచ్చగొట్టి సానుభూతి పొందేందుకు కేసీఆర్ నటిస్తున్నారని.. రైతాంగం అర్థం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో నీటి కొరత లేకుండా చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
సాగర్ జలాలతో ఈ ప్రాంత చెరువులు, కుంటలను నింపి త్రాగునీటి ఇబ్బందులను తొలగిస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పది సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం తీవ్రంగా దెబ్బ తిన్నదన్నారు. బీఆర్ఎస్ నాయకులు లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.
నీటి సమస్యపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని.. ఇది ఎప్పటికీ జరగదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పేదల పక్షపాతి అని.. వారి సంక్షేమం కోసం ఎన్ని విధాలైనా కాంగ్రెస్ ప్రభుత్వం కష్టపడుతుందని వెల్లడించారు.
వేసవికాలంలో వర్షాలు పడటం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుపిస్తున్నారన్నారు. వర్షాలు అనేవి ఎన్నికల కంటే ముందే వచ్చాయని.. వచ్చిన నీటిని ఆ ప్రభుత్వమే నదులు పాలు చేసిందని మంత్రి పొంగులేటి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.