ఖమ్మంలో పట్టుబడ్డ హైదరాబాద్ వేటగాళ్లు
ఖమ్మం అడవుల్లో మెరుగైన స్నైపర్ గన్ తో వేటాడేందుకు వచ్చిన హైదరాబాద్‌కు చెందిన వేటగాళ్లను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు.
ఖమ్మం జిల్లా తల్లాడ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఆరుగురు వ్యక్తులు వేటాడేందుకు ప్రయత్నిస్తుండగా అటవీ శాఖ అధికారులు వారిని అడ్డుకున్నారు.
వారి నుండి స్నైపర్ రైఫిల్, బుల్లెట్లు, ఒక కత్తి, ఆరు ఫోన్లు సహా ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో నలుగురు హైదరాబాద్ కు చెందిన వ్యక్తులుగా, మరో ఇద్దరు కొత్తగూడెం జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు.
నిందితులలో అసలు సూత్రదారి హైదరాబాద్ కు చెందిన సుగ్రీవ్ జీర్(58), కొత్త గూడెం జిల్లా చంద్రుగొండ మండలానికి చెందిన పాములు పట్టే వీడియోలను పోస్టు చేసి పేరు గాంచిన యూట్యూబర్ డేరంగుల మిధున్ కుమార్(31) సాయంతో వేటాడేందుకు వచ్చారని తెలియజేశారు.
ఈ ఘటన తల్లాడ రేంజ్ లోని గట్టుగూడెం సెక్షన్ లోని బ్రహ్మలకుంట బీట్ కు దగ్గర కనకగిరి రిజర్వు ఫారెస్టులో చోటు చేసుకుంది. ఎండకాలం నీటి కొరత దృష్ట్యా చిరుత పులులు, జింకలు, ఎలుగుబంట్లు వంటి వన్యప్రాణులు ఈ ప్రాంతంలోని పెద్ద నీటి వనరు దగ్గరకు జంతువులు వస్తాయి.
ఈ సమాచారం తెలుసుకున్న నిందితులు ఈ ప్రాంతంలో విడిది ఏర్పాటు చేసుకొని వేటాండేందుకు ప్రయత్నిస్తున్నారని పై అధికారుల నుంచి సమాచారం అందిందని అటవీ అధికారులు స్పష్టం చేశారు.
నిందితులను 14 రోజులు రిమాండ్ కు తరలించామని, కోర్టు పర్మిషన్ తో నింధితులను విచారించి మరిన్ని వివరాలు రాబడతామని ఫారెస్ట్ అధికారి డీఎఫ్‌వో సిద్ధార్ద్ విక్రమ్ సింగ్ తెలిపారు.