ఖమ్మం, ఏప్రిల్ 10: పల్లె దవాఖానలో వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టర్, రఘునాథపాలెం మండలం వి. వెంకటయపాలెం గ్రామంలోని పల్లె దవాఖాన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. షుగర్, బి పి. వ్యాధిగ్రస్థులకు ప్రతి నెలా మందులు ఇవ్వాలన్నారు. వ్యాధినిరోధక టీకాలు ఎంతమంది పిల్లలకు ఇచ్చినది, ఇంకా ఎంత మందికి ఇవ్వాల్సింది అడిగి తెలుసుకున్నారు. వ్యాధినిరోధక టీకాలు ఇవ్వాల్సిన ప్రతి ఒక్క పిల్లవాడికి అందించాలన్నారు. పాము, కుక్క కాట్లకు మందులు అందుబాటులోఉంచాలన్నారు. ఇడిడి చార్ట్ ప్రదర్శించాల న్నారు. గర్భిణులకు అవసరమైన పరీక్షలు సమయానుసారం చేయించాలని ఆయన తెలిపారు. పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ అన్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎండ వేడి నుంచి కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పట్టణాలు, గ్రామాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో స్థానిక ప్రజలను వేసవి జాగ్రత్తలపై అవగాహన పరచాలని అధికారులను సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మాలతీ, డాక్టర్ బాలకృష్ణ మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.