ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పై దాడి….
పాల్వంచ : ములకలపల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో ఫారెస్ట్ ఉద్యోగం అంటే కత్తి మీద సాములా తయారైంది. ఓ పక్క అటవీశాఖ కొత్త ప్లాంటేషన్ల ఏర్పాటు, ఇంకోపక్క పోడు సాగుదారులు వచ్చే ఏడాదికి వ్యవసాయం కోసం భూముల్లో పనులు మొదలుపెట్టారు.
ఈ క్రమంలో ఇటు పోడు సాగుదారులు, అటు అటవీ ఉద్యోగుల మధ్య పరస్పరం దాడుల పరంపర కొనసాగుతుంది. పోడు సాగుదారుల దాడుల్లో అటవీ ఉద్యోగులు, పోలీసులు తీవ్రంగా గాయపడుతున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
సత్తుపల్లి సీఐ పై జరిగిన దాడి ఘటన ఒకపక్క, ములకలపల్లి మండలం అన్నారం గ్రామంలో పోడు సాగుదారుడు చుక్కయ్య దాడితో అటవీ బీట్ అధికారి పూర తలకు తీవ్ర గాయాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఘటన మరోపక్క ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ రెండు ఘటనలు మరువకముందే వారం
తిరగకుండానే గుండాలపాడు పంచాయతీ చలమన్న నగర్ ఎఫ్బి ఓ వెంకన్న నాయక్ పై బుధవారం చలమన్న నగర్ గ్రామానికి చెందిన పోడు సాగుదారులు మూకుమ్మడిగా దాడి చేశారు.
దాంతో వెంకన్న నాయక్ తీవ్రంగా గాయపడ్డారు. పోడు సాగుదారుల భూములను ఆనుకొని అటవీశాఖ కొత్తగా చెరువు పనులు మొదలుపెట్టింది. ఈ విషయమై స్థానిక పోడు సాగుదారులకు బీట్ ఆఫీసర్ కు మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో డ్యూటీలో ఉన్న బీట్ అధికారి వెంకన్న నాయక్ పై సుమారు 15 మంది కర్రలతో దాడి చేసినట్లు అటవీ శాఖ ఉద్యోగులు తెలుపుతున్నారు. ఈ దాడిలో వెంకన్న నాయక్ శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. అటవీ సిబ్బంది హుటాహుటిన వెంకన్న నాయక్ ను పాల్వంచ ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో అటవీ శాఖ ఫిర్యాదు చేసింది.