ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తాం
సీ కే న్యూస్ ప్రతినిధి, కొల్లాపూర్:
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన లక్ష్యం
మల్లయిపల్లి, చింతకుంట, దొండాయపల్లి గ్రామాలలో పర్యటించిన మంత్రి
రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ జూపల్లి కృష్ణారావు
ఆర్థిక క్రమశిక్షణతో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని, ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురవస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు .
సోమవారం కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలోని ఉన్న పాన్ గల్ మండల పరిధిలోని మల్లయిపల్లి,చింతకుంట మరియు దొండాయపల్లి వివిధ గ్రామాలలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించి గ్రామాల్లో ప్రజలు, మరియు మహిళ సంఘాలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధే ప్రధాన లక్ష్యమని, ప్రతి గ్యారెంటీని ప్రతి ఇంటికి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు.
ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సదుపాయం, రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ. 10 లక్షలకు పెంపు అమలు చేసిందని తెలిపారు. ఇప్పటికే రూ. 500 కే వంట గ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందిస్తున్నామని, ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కూడా ప్రారంభించామని మంత్రి మాట్లాడుతూ తెలిపారు.
కొల్లాపూర్ నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరయ్యాయని , లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా చేపడతామని, అర్హులైన లబ్దిదారులను స్వయంగా తానే ఎంపిక చేస్తానని స్పష్టం చేశారు. రూ. 2 లక్షల రుణమాఫీ, పంటల బీమా త్వరలో అమలు చేస్తామని, ఇప్పటికే 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు రైతు భరోసా పథకం ద్వారా పంట పెట్టుబడి సాయాన్ని అందజేశామని పేర్కొన్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నీటిమూటలయ్యాయి తప్ప ఎవరికీ లబ్ధి చేరలేదన్నారు. ఇంటికి పెద్ద కుటుంబానికి వచ్చిన ఆస్తి కాపాడి తన పెద్దరికాన్ని నిలబెట్టుకుంటాడని, కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలా వ్యవహరించకుండా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడని ఆయన మాట్లాడుతూ తెలిపారు అన్నారు.
కాంగ్రెస్ పార్టీపై ఎంతో నమ్మకంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేశారని, పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాన్ గల్ మండల,ఆయా గ్రామాల ప్రస్తుత,మాజీ ప్రజాప్రతినిధులు మరియు మండల,గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు